Updated : 27 Jun 2022 07:23 IST

మేమున్నది ఊళ్లోనా.. అడవిలోనా?

ప్రశ్నించినందుకే వైకాపా నేతల కక్ష సాధింపు

తెలుగు మహిళలతో అల్లూరు బాధితురాలు కవిత

ఈనాడు డిజిటల్‌, ఒంగోలు: ‘ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలతో రైతులకు అన్యాయం జరిగింది. ఈ విషయమై నిలదీసినందుకు నాపై వైకాపా నాయకులు కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారు. మహిళనని కూడా చూడకుండా నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇంటికి తాళం వేసి.. నీళ్లు, పాలు అందకుండా చేశారు. మేము ఉంటున్నది ఊళ్లోనా.. లేక అడవిలోనా అనేది తెలియట్లేదు’ అని ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం అల్లూరుకు చెందిన కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటికి తాళం వేసి ఇబ్బంది పెడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వీడియో పెట్టడంతో.. కవితను తెలుగు మహిళలు అల్లూరులోని ఆమె నివాసంలో ఆదివారం పరామర్శించారు. అధైర్యపడొద్దని, తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తన పరిస్థితి నెల రోజుల నుంచి దారుణంగా ఉందని... ఒక మహిళను ఇబ్బందిపెట్టేందుకు వైకాపా నాయకులు మొత్తం పనిచేయడం ఏం న్యాయమని ఈ సందర్భంగా కవిత ప్రశ్నించారు. ఆమెను పరామర్శించినవారిలో తెదేపా మహిళా విభాగం నాయకులు రావుల పద్మజ, కామరాజుగడ్డ కుసుమకుమారి, బీరం అరుణారెడ్డి, ఆర్ల వెంకటరత్నం, షేక్‌ అజీమున్నీసా తదితరులున్నారు. అనంతరం జనసేన వీర మహిళలు కూడా కలిసి వివరాలు తెలుసుకున్నారు.

ఇదీ నేపథ్యం...
కొత్తపట్నం మండలం అల్లూరులో రెండేళ్లుగా ధాన్యం కొనుగోళ్లలో రూ.కోట్లలో గోల్‌మాల్‌ చోటుచేసుకుంది. గత నెలలో పీఎం కిసాన్‌ క్రెడిట్‌కార్డుల మంజూరుపై ఆ ఊళ్లో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించినప్పుడు.. ఈ అవకతవకలను వ్యవసాయ అధికారులకు కవిత వివరించారు. అనంతరం గడపగడపకు కార్యక్రమానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వచ్చినప్పుడూ ఆమె రైతుల గురించి మాట్లాడబోయారు. అప్పుడే కొందరు వైకాపా నాయకులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాతే తన ఇంటి గేటుకు తాళం వేశారని వీడియోలో చెప్పారు.

అత్తింటి వారు బంధించారు
‘ఇంట్లో బంధించి తాళాలు వేసి వెళ్లిపోయారు. గాలి ఆడక ఇబ్బంది పడుతున్నాను. దయచేసి ఎవరైనా కాపాడండి..’ అని కవిత ‘ఈనాడు’కు ఫోన్‌చేసి ఆదివారం రాత్రి కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగు మహిళలు, జనసేన వీరమహిళలు పరామర్శించి వెళ్లిన తర్వాత అత్త, మామ, భర్త తనపై దాడి చేసినట్టు ఆమె పేర్కొన్నారు. తనను చూడటానికి వచ్చిన తల్లిదండ్రులపైనా కేసులు నమోదు చేయిస్తామని పోలీసులు, స్థానిక వైకాపా నాయకులు బెదిరిస్తున్నారని తెలిపారు. తాను గ్రామంలోకి రావాలంటే ఆ మహిళ ఉండొద్దని ఒక ప్రజాప్రతినిధి చెప్పారని, అందుకే నాయకులు ఇలా చేస్తున్నారని రోదించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని