విక్రమ్‌రెడ్డి మెజారిటీ 82,888

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించింది. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి భారీ

Updated : 27 Jun 2022 06:23 IST

ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైకాపా విజయం.. ఏకపక్షం

మిగిలిన ఏ ఒక్కరికీ దక్కని ధరావతు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైకాపా ఘనవిజయం సాధించింది. దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి సోదరుడు విక్రమ్‌రెడ్డి భారీ ఆధిక్యంతో గెలిచారు. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం ఓట్లు లెక్కించారు. మొత్తం 20 రౌండ్లలోనూ విక్రమ్‌రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు. ఆత్మకూరులో మొత్తం ఓటర్లు 2,13,338 మంది కాగా.. ఈ నెల 23న జరిగిన పోలింగ్‌లో 1,37,081 మందే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా మరో 217 ఓట్లు పోలయ్యాయి. 15 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డి విజయం ఖరారైంది. పోలైన ఓట్లలో 50 శాతానికి పైగా.. అంటే 76,096 ఓట్లు దక్కించుకోవడంతో ఆయన విజయం ఏకపక్షమని తేలిపోయింది. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి మొత్తం 1,02,241 ఓట్లు దక్కించుకున్నారు. తన ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,888 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

అన్న కంటే ఎక్కువ ఆధిక్యం..: 2019లో జరిగిన ఆత్మకూరు శాసనసభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలో దిగిన మేకపాటి గౌతమ్‌రెడ్డి 92,758 ఓట్లు దక్కించుకున్నారు. ప్రత్యర్థి, తెదేపా అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై 22,276 ఓట్ల అధిక్యంతో గెలిచారు. తాజాగా జరిగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో విక్రమ్‌రెడ్డి తన సోదరుడు సాధించిన ఓట్ల కన్నా 9,456 ఓట్లు అధికంగా సాధించి.. ఎక్కువ ఆధిక్యంతో విజయం సొంతం చేసుకున్నారు. ఈసారి భాజపాకు 19,353, బీఎస్పీకి 4,904, నోటాకు 4,182, ఇతరులకు 6,609 ఓట్లు రాగా, 9 ఓట్లను తిరస్కరించారు. ధరావతు దక్కాలంటే మొత్తం పోలైన ఓట్లలో ఆరో వంతు రావాలి. అంటే.. 22,883 సాధించాలి. భాజపా అభ్యర్థి సహా ఏ ఒక్కరికీ అన్ని ఓట్లు రాకపోవడంతో అందరూ ధరావతు కోల్పోయినట్లయింది.


ప్రభుత్వం చేస్తున్న మంచికి మద్దతే ఆత్మకూరు విజయం

ట్విటర్‌లో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచికి మద్దతుగా, గౌతమ్‌రెడ్డికి నివాళిగా ఆత్మకూరు ఉప ఎన్నికల విజయం నిలుస్తుందని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘భారీ మెజార్టీతో విక్రమ్‌రెడ్డిని దీవించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష’ అని తన ట్వీట్‌లో అన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని