రాజీనామా చేసి ఎన్నికల్లో తలపడండి

అసమ్మతి బావుటా ఎగరేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివసేన మరింత దూకుడు పెంచింది. గువాహటిలోని ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలపై పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ విరుచుకుపడ్డారు. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలని వారికి సవాల్‌ విసిరారు.

Updated : 27 Jun 2022 09:42 IST

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు శివసేన డిమాండ్‌

అసమ్మతి సభ్యులకు కేంద్రం ‘వై ప్లస్‌’ భద్రత

గువాహటి గూటికి మరో మంత్రి పయనం

అసమ్మతి బావుటా ఎగరేసిన తిరుగుబాటు ఎమ్మెల్యేలపై శివసేన మరింత దూకుడు పెంచింది. గువాహటిలోని ఉన్న రెబల్‌ ఎమ్మెల్యేలపై పార్టీ అధికార ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ విరుచుకుపడ్డారు. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి, ఎన్నికల్లో పోటీ చేయాలని వారికి సవాల్‌ విసిరారు. ‘ఇంకెంత కాలం అస్సాంలో దాక్కుంటారు? తిరిగి రావాలి’ అని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించిన మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌ ఫొటోను రౌత్‌ ట్విటర్లో పోస్ట్‌ చేశారు. నిజమైన శివ సైనికులు ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే వెంట ఉంటారని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలంతా ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. తిరుగుబావుటా ఎగరేసి గువాహటిలో ఉన్న 15 మంది శాసనసభ్యులకు సీఆర్పీఎఫ్‌ బలగాలతో ‘వై ప్లస్‌’ భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. వారికి ప్రాణహాని ఉండవచ్చన్న కేంద్ర సంస్థల అంచనా మేరకు భద్రతను కల్పిస్తున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో వారి కుటుంబ సభ్యులకూ రక్షణ ఉండేలా గృహ భద్రత బృందాలను నియమించింది. దీనిని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే తప్పుపట్టారు. ఎమ్మెల్యేలంతా రెబల్స్‌గా మారినా విజయం మాత్రం పార్టీదే అవుతుందన్నారు.
రంగంలోకి సీఎం భార్య
శివసేన రెబల్‌ ఎమ్మెల్యేలు పట్టువీడటం లేదు. ఏక్‌నాథ్‌ శిందేతోనే తాము ఉంటామంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే రంగంలోకి దిగారు. రెబల్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి వారి భార్యలతో ఆమె మాట్లాడుతున్నారు. భర్తకు నచ్చజెప్పి, గువాహటి నుంచి వెనక్కి వచ్చేయాల్సిందిగా చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సంక్షోభంలో పడిన ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు ఈ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఉద్ధవ్‌ సైతం అసమ్మతి ఎమ్మెల్యేలకు సందేశాలు పంపుతున్నారని, దాదాపు 20 మంది రెబల్‌ నేతలు ఆయనతో టచ్‌లో ఉన్నారని ఠాక్రే వర్గీయులు పేర్కొంటున్నారు. గువాహటిలో బస చేసిన ఎమ్మెల్యేల వద్దకు అస్సాం మంత్రులిద్దరు వెళ్లి మాట్లాడారు.

నేడు సుప్రీంలో శిందే పిటిషన్‌ విచారణ

శివసేన శాసనసభాపక్ష నేతగా తనను తొలగిస్తూ డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయంపై శిందే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు కనీసం వారం గడువు ఇవ్వాలని, అలా జరగనందువల్ల న్యాయ పోరాటం చేయాలని ఆయన భావిస్తున్నారు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం పరిశీలించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని అనుకుంటున్నారా అనే విషయమై శిందేతో మే నెలలోనే ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడారని మంత్రి ఆదిత్య ఠాక్రే వెల్లడించారు.

అసమ్మతి శిబిరంలో పెరిగిన మంత్రుల బలం

మహారాష్ట్ర మంత్రి ఉదయ్‌ సామంత్‌, శివసేనకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం ఆదివారం సూరత్‌ నుంచి గువాహటికి వెళ్లి శిందే శిబిరంలో చేరారు. ఇప్పటికే శిందే వర్గంలోకి 8 మంది శివసేన మంత్రులు వెళ్లారు. ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో శివసేన మంత్రులు నలుగురే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రులైనవారిలో ఆదిత్య ఠాక్రే తప్ప అంతా శిందే వైపు వెళ్లినట్లే. 16 మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు శివసేన ఎంపీ అరవింద్‌ సావంత్‌ తెలిపారు. నోటీసులకు వారంతా సోమవారంలోగా సమాధానాలు ఇవ్వాల్సి ఉంది.

వారికి భద్రత కల్పించండి: గవర్నర్‌

శిందే వర్గంలోని ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబసభ్యులకు తక్షణమే భద్రత కల్పించాలని రాష్ట్ర డీజీపీకి గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ లేఖ రాశారు.

ఠాక్రేకు సోనియా ఫోన్‌

ఉద్ధవ్‌ ఠాక్రేకు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫోన్‌ చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తోడుగా ఉంటామని భరోసా ఇచ్చారు. కరోనా బారిన పడ్డ మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు. రెబల్స్‌కు వ్యతిరేకంగా శివసేన నేతలు ముంబయి, పుణె సహా వివిధ ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మహా వికాస్‌ అఘాడీ నేతలతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ సమావేశమయ్యారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌ మంత్రులు బాలాసాహెబ్‌ థోరాట్‌, అశోక్‌ చవాన్‌, శివసేనకు చెందిన అనిల్‌ పరబ్‌, అనిల్‌ దేశాయ్‌లతో భేటీ అయ్యారు. ఆరు రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో పవార్‌ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని