కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్‌

వచ్చే ఏప్రిల్‌, మేలో ఎన్నికలు ఉంటాయని, జూన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  చెప్పారు. ఇది వరకు వివిధ పార్టీల్లో కొనసాగిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

Published : 27 Jun 2022 05:16 IST

 రేవంత్‌ సమక్షంలో పార్టీలోకి పలువురు నేతలు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: వచ్చే ఏప్రిల్‌, మేలో ఎన్నికలు ఉంటాయని, జూన్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  చెప్పారు. ఇది వరకు వివిధ పార్టీల్లో కొనసాగిన పలువురు నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. మాజీ మంత్రి, భాజపా నాయకుడు బోడ జనార్దన్‌ (చెన్నూరు)తో పాటు తెరాస నుంచి మెట్‌పల్లి జడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచి ఆ పార్టీకి రాజీనామా చేసిన రాధ శ్రీనివాస్‌రెడ్డి, కళ్లెం శంకర్‌రెడ్డి, గోపి ముత్యంరెడ్డి, రావి శ్రీనివాస్‌ (సిర్పూర్‌ కాగజ్‌నగర్‌) తదితరులు అనుచరులతో కలిసి ఆదివారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రేవంత్‌ వారికి పార్టీ కండువా కప్పారు. మాజీ ఎమ్మెల్సీ కె.ప్రేమ్‌సాగర్‌రావు ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన తెరాస నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆదివారం సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సమక్షంలో కాంగ్రెస్‌లోకి వచ్చారు.

పార్టీలోకి వడ్డెపల్లి రవి

తుంగతుర్తి నియోజకవర్గం నుంచి 2018లో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వడ్డెపల్లి రవి ఆదివారం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2016లో కాంగ్రెస్‌లో చేరిన రవి, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్‌ ఇద్దరూ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ప్రయత్నించారు. దయాకర్‌కు టికెట్‌ ఇవ్వడంతో రవి రెబల్‌గా బరిలో నిలిచారు. తన ఓటమికి కారణమై బహిష్కరణకు గురైన రవిని పార్టీలో చేర్చుకోవడంపై అద్దంకి దయాకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేడు నియోజకవర్గాల్లో సత్యాగ్రహ దీక్షలు

అగ్నిపథ్‌ను రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో చేపట్టనున్న నిరసన సత్యాగ్రహ దీక్షలను విజయవంతం చేయాలని  రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఏఐసీసీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు నాజర్‌ హుస్సేన్‌, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌, హర్కర వేణుగోపాల్‌ తదితరులతో కలిసి ఆయన ఆదివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాజర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ఆర్మీ ఉద్యోగులను తగ్గించి యుద్ధం వస్తే ఏం చేస్తారని ప్రశ్నించారు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులై సంవత్సరం అయిన సందర్భంగా పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రేవంత్‌ను కలిసిన డీఎస్సీ 2008 బీఈడీ అభ్యర్థులు

టీపీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ 2008లో నష్టపోయిన బీఈడీ అభ్యర్థులు ఆదివారం గాంధీభవన్‌లో రేవంత్‌రెడ్డిని కలిశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రేవంత్‌ వారికి హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు