సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా నేత డీవీ కృష్ణ కన్నుమూత

విప్లవోద్యమ నేత, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి దుర్గంపూడి వెంకటకృష్ణ అలియాస్‌ డీవీ కృష్ణ(77) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని సోదరుడి నివాసంలో

Published : 27 Jun 2022 05:24 IST

నల్లకుంట, న్యూస్‌టుడే: విప్లవోద్యమ నేత, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి దుర్గంపూడి వెంకటకృష్ణ అలియాస్‌ డీవీ కృష్ణ(77) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలం నుంచి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని సోదరుడి నివాసంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పార్టీ శ్రేణులు, అభిమానుల సందర్శనార్థ పార్థివదేహాన్ని సాయంత్రం వరకు విద్యానగర్‌ మార్క్స్‌భవన్‌ వద్ద ఉంచారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని తేలుకుట్లలో 1945లో నాగేంద్రమ్మ, వెంకటప్పారెడ్డి దంపతులకు డీవీ కృష్ణ జన్మించారు. ఆయనకు మూడేళ్లు ఉన్నప్పుడు కుటుంబం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ డివిజన్‌ పెంటకుర్దు గ్రామానికి వలసవెళ్లి అక్కడే స్థిరపడింది. 1968లో బోధన్‌లోని చక్కెర కర్మాగారంలో కృష్ణ ఎల్‌డీసీగా చేరారు. అప్పటి నుంచే కమ్యూనిస్టు రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. 1970లో ఉద్యోగాన్ని వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేరి చండ్ర పుల్లారెడ్డితో కలిసి విప్లవోద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నుంచి సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు పార్టీ నాయకులు వివరించారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌) ప్రజాపంథా నేతలు రంగారావు, రాంచందర్‌, పలువురు న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ) నేతలు కృష్ణ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. డీఎస్‌ కృష్ణ పార్థివదేహాన్ని ఆయన కటుంబసభ్యులు గాంధీ వైద్య కశాశాలకు అప్పగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని