Updated : 29 Jun 2022 06:24 IST

కమలనాథుల ‘మహా’ ఎత్తు

అమిత్‌ షా, నడ్డాలతో దిల్లీలో ఫడణవీస్‌ మంతనాలు

బలపరీక్షకు సీఎంను ఆదేశించాలని గవర్నర్‌కు వినతి

శిందే వర్గాన్ని చర్చలకు ఆహ్వానించిన ఠాక్రే

ముంబయి, ఈనాడు-గువాహటి: మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారి మలుపు తిరిగింది. అసమ్మతి రాజకీయాలను తెరవెనుక నుంచి ఎగదోస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా మంగళవారం వేగంగా, బాహాటంగా పావులు కదిపింది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సంకీర్ణం కుప్పకూలితే శివసేన అసమ్మతి వర్గంతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కమలనాథుల వ్యూహంగా కనిపిస్తోంది. దీనికి తగ్గ కార్యాచరణను సిద్ధం చేసేందుకు మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ రంగంలో దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డాలతో ఆయన దిల్లీలో భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. దీనిలో భాజపా ఎంపీ, సీనియర్‌ న్యాయవాది మహేశ్‌ జెఠ్మలానీ కూడా పాల్గొన్నారు. పార్టీపరంగా తదుపరి కార్యాచరణపై వారు చర్చించినట్లు సమాచారం. దిల్లీ నుంచి తిరిగి వచ్చాక మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో గవర్నర్‌ కోశ్యారీతో ఫడణవీస్‌ భేటీ అయ్యారు. శాసనసభలో విశ్వాస పరీక్ష నిమిత్తం సీఎంను ఆదేశించాలని కోరారు. 39 మంది శివసేన ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం లేదనీ, సర్కారు మైనారిటీలో పడిందని రాసిన లేఖను ఆయనకు అందజేశారు. ఫడణవీస్‌ రాజ్‌భవన్‌కు వెళ్లడానికి ముందు గువాహటి శిబిరం నుంచి ఎనిమిది మంది స్వతంత్ర శాసనసభ్యులు కూడా బలపరీక్ష నిమిత్తం ఇ-మెయిల్‌లు పంపించారు.

మించిపోయిందేమీ లేదన్న ఉద్ధవ్‌

అసమ్మతి శిబిరంలో చేరిన మంత్రుల శాఖల్ని వేరేవారికి కేటాయించిన ఒకరోజు వ్యవధిలోనే ఉద్ధవ్‌ ఠాక్రే మెత్తబడ్డారు. ‘ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. గువాహటి నుంచి ముంబయికి రండి. కూర్చొని మాట్లాడుకుందాం’ అని పిలుపునిచ్చారు. ముఖాముఖి మాట్లాడుకుంటే ఒక మార్గం దొరుకుతుందని చెప్పారు.

నోటితో నవ్వి.. నొసటితో వెక్కిరింతా?

ఠాక్రే పిలుపుపై శిందే పెద్ద ఉత్సాహం చూపించలేదు. ఉద్ధవ్‌ తనయుడు ఆదిత్య ఠాక్రే, శివసేన అధికార ప్రతినిధి సంజయ్‌రౌత్‌ తమపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆయన గుర్తు చేస్తున్నారు. తన శిబిరంలోని కొందరు ఎమ్మెల్యేలు పార్టీతో సంప్రదింపులు చేస్తున్నట్లు శివసేన చెప్పడాన్ని ప్రస్తావిస్తూ.. దమ్ముంటే వారి పేర్లను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ‘ఒకపక్క మమ్మల్ని పందులుగా, కుక్కలుగా, నల్లాలోని మురుగునీటిగా, కళేబరాలుగా పోల్చి.. మరోపక్క హిందూ వ్యతిరేక ఎంవీయే సర్కారును రక్షించడానికి రమ్మంటే ఎలా’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. త్వరలో తాను ముంబయికి తిరిగి వెళ్లనున్నట్లు ప్రకటించారు. గువాహటిలో సహచర ఎమ్మెల్యేలతో కలిసి బస చేసిన హోటల్‌ ర్యాడిసన్‌ బ్లూ వెలుపల ఆయన తొలిసారిగా విలేకరులతో మాట్లాడారు. 50 మంది ఎమ్మెల్యేలు ఆనందంగా తనతో వచ్చారని, ఎవరినీ బంధించలేదని చెప్పారు.

బయట తిరగనివ్వకుండా చేయాలి: రౌత్‌

పార్టీ నాయకత్వాన్ని వంచించినవారిని బయట తిరగనివ్వకుండా చేయాలని శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ అన్నారు. భాజపాతో ఇప్పుడు శిందే చేతులు కలిపితే ఉప ముఖ్యమంత్రి అవుతారనీ, కూటమి ఆవిర్భావ సమయంలోనే ఆయన్ని సీఎంని చేయాలని ఠాక్రే అనుకున్నారని చెప్పారు.

* ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, సంజయ్‌రౌత్‌లపై దేశద్రోహం కేసులు నమోదు చేసేలా ఆదేశాలివ్వాలంటూ పుణెకు చెందిన సామాజిక కార్యకర్త ఒకరు బొంబాయి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు.


ఎంపీలూ అటే వెళ్తారా?

శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల దారిలో ఆ పార్టీ ఎంపీలు కూడా పయనిస్తున్నట్లు తెలుస్తోంది. శివసేనకు లోక్‌సభలో 19 మంది ఎంపీలు ఉండగా వారిలో 14 మంది ఏక్‌నాథ్‌ శిందేతో, భాజపాతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారు తమ శిబిరంలో చేరితే శివసేన పార్టీ, ఎన్నికల గుర్తు కోసం ప్రయత్నిస్తున్న శిందేకు మరింత బలం చేకూరుతుంది. మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేనకు 55 మంది సభ్యులుండగా వీరిలో 39 మంది తిరుగుబాటు చేశారు. వీరికి శిందే నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో తమ వర్గాన్నే అసలైన శివసేనగా గుర్తించాలని శిందే కోరుతున్నారు. దీనిపై గవర్నర్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీలు కూడా శిందేకు మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని