వైకాపాతోనే రాష్ట్ర భవిష్యత్తు

మూడేళ్ల పాలనపై సమీక్షించుకోవడం, మెరుగైన రీతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు భవిష్యత్తు చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ప్లీనరీలో జరుగుతుందని ప్రభుత్వ

Published : 30 Jun 2022 05:23 IST

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తాడేపల్లి, న్యూస్‌టుడే: మూడేళ్ల పాలనపై సమీక్షించుకోవడం, మెరుగైన రీతిలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు భవిష్యత్తు చిత్రపటాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ప్లీనరీలో జరుగుతుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మంగళగిరి పరిధిలోని కాజ వద్ద ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ ఎదురుగా జాతీయ రహదారి పక్కనే జులై 8, 9తేదీల్లో జరగనున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను బుధవారం ఆయనతో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్‌, లేళ్ల అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మాణిక్యవరప్రసాద్‌, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు ముస్తఫా, రోశయ్య, మాజీ హోంమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు సుచరిత పరిశీలించారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర భవిష్యత్తు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ చరిత్రతో ఇక ముందూ ముడిపడి ఉంది. ప్రజల ఎజెండా సమీక్షించుకుని వారి అవసరాలు, సంక్షేమాన్ని, రాష్ట్రాభివృద్ధిని ఇక్కడ నుంచి నిర్దేశించుకునే ప్లీనరీ కాబట్టి దీనికి ప్రత్యేకత ఉంది...’ అని పేర్కొన్నారు. పార్టీ తరఫున పోటీ చేసిన క్షేత్ర స్థాయిలోని వార్డు నాయకుడి వరకు వ్యక్తిగతంగా హాజరు కావాలని అందరినీ ప్రత్యేకంగా జగన్‌మోహన్‌రెడ్డి సంతకంతో ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ‘కిక్‌ బాబు అవుట్‌. గాట్‌ ది పవర్‌ అండ్‌ సర్వ్‌ ద పీపుల్‌’ అనే నినాదంతో 2024లో జరిగే ఎన్నికల్లో మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తామని ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. ప్లీనరీ తొలి రోజు ప్రారంభోపన్యాసం పాటు... చివరి రోజు 9వ తేదీ సాయంత్రం అధ్యక్షులు సందేశం ఇస్తారని వెల్లడించారు. పార్టీ నియమావళిలో కొన్ని సవరణలను కూడా ప్రతిపాదిస్తామని, వాటికి ప్లీనరీ ఆమోదం కోరతామని చెప్పారు. వివిధ అంశాలపై నాయకులు చర్చించి కొన్ని తీర్మానాలు చేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని