మోదీ సభకు భారీ జనసమీకరణ!

హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభకు కమలదళం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం శంషాబాద్‌, బేగంపేట విమానాశ్రయాలకు,

Updated : 30 Jun 2022 05:24 IST

16 రైళ్లు, ప్రత్యేక బస్సుల ఏర్పాటు

నియోజకవర్గాలకు సీనియర్‌ నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాలు, బహిరంగసభకు కమలదళం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. భాజపా తెలంగాణ ఇన్‌ఛార్జి తరుణ్‌ ఛుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం శంషాబాద్‌, బేగంపేట విమానాశ్రయాలకు, సమావేశాలు జరిగే హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌కు వెళ్లి పరిశీలించారు. జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు నోవాటెల్‌లో 270 గదులు కేటాయించారు. మరికొందరికి వెస్టిన్‌ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. పార్టీ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్‌గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్‌లకు ఎగ్జిక్యూటివ్‌ సూట్లు, ముఖ్యమంత్రులకు జూనియర్‌ సూట్లు కేటాయించారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో 3న నిర్వహించే విజయ సంకల్పసభను కమలనాథులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని భారీ జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల నుంచి జనసమీకరణ బాధ్యతల్ని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తీసుకున్నారు. మిగిలిన జిల్లాల నుంచి జనసమీకరణను బండి సంజయ్‌ భుజాన వేసుకున్నారు. కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యే వారిలో 40 మందికి పైగా నాయకులు బుధవారమే హైదరాబాద్‌కు చేరుకుని, తమకు అప్పగించిన నియోజకవర్గాలకు వెళ్లారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జులై 1న, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు.

విజయ సంకల్పసభకు రైళ్లు, బస్సులు

విజయ సంకల్ప సభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయాలని కమలదళం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 16 రైళ్లు, భారీ సంఖ్యలో ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు బుక్‌ చేసినట్లు సమాచారం. 10 లక్షల ఆహ్వానపత్రికలు ముద్రించిన పార్టీ గురువారం నుంచి వాటిని ప్రజలకు ఇచ్చి ఆహ్వానం పలకనుంది. ఒక్కో పోలింగ్‌ బూత్‌ నుంచి 30 మందిని తీసుకురావాలని లక్ష్యం నిర్దేశించిన భాజపా నాయకత్వం.. సంబంధిత బూత్‌ అధ్యక్షుడికే వారి ఆహార బాధ్యతల్ని అప్పగించింది.

నియోజకవర్గాల్లో నేతల ఆరా

జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చే వారిలో 119 మంది సీనియర్‌ నాయకులను రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గాలకు ఒక్కొక్కరి చొప్పున భాజపా పంపుతోంది. వారు గురువారం నుంచి జులై 2వ తేదీ ఉదయం వరకు అక్కడే ఉంటారు. మోదీ సభకు జనసమీకరణ ఏర్పాట్లు చూడటంతో పాటు ఆ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, బలాబలాలు తదితర అంశాలు, కార్యకర్తలు, ఆరెస్సెస్‌ నాయకులు, ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు. అనంతరం వీరు పార్టీ అధిష్ఠానానికి నివేదికలు ఇవ్వనున్నారు. ఈ నాయకులను వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు రెండు, మూడు నెలలకోసారి ఇలాగే నియోజకవర్గాలకు పంపాలని భాజపా యోచిస్తోంది.

తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికే అవకాశం

కార్యవర్గ సమావేశాలకు తెలుగు రాష్ట్రాల నుంచి 12 మందికే ప్రవేశం ఉంటుందని తెలిసింది. తెలంగాణ నుంచి జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌, డి.కె.అరుణ, వివేక్‌, జితేందర్‌రెడ్డి, రాజాసింగ్‌, మంత్రి శ్రీనివాస్‌, గరికపాటి మోహన్‌రావు, లక్ష్మణ్‌, విజయశాంతి, ఆంధ్రప్రదేశ్‌ నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు పాల్గొననున్నారు.

18 ఏళ్ల తర్వాత మళ్లీ హైదరాబాద్‌ వేదిక

భాజపా కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదిక కావడం ఇది రెండోసారి. 18 ఏళ్ల కిందట 2004లో అప్పటి ప్రధానమంత్రి వాజ్‌పేయి, ఉప ప్రధాని ఎల్‌.కె.ఆడ్వాణీ, పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎం.వెంకయ్యనాయుడుల ఆధ్వర్యంలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే కీలక తీర్మానం జరిగింది. సంకల్పం-2004 నినాదంతో నాటి సమావేశాలు జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా భాజపా హైదరాబాద్‌ను వేదికగా చేసుకుంది.

నాటి, నేటి సమావేశాల మధ్య పలు సారూప్యతలు, ప్రత్యేకతలు ఉన్నాయి. అప్పుడు, ఇప్పుడు కూడా బహిరంగసభకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానమే వేదిక. నాడు కార్యవర్గ సమావేశాలు ట్యాంక్‌బండ్‌ సమీపంలోని వైస్రాయ్‌ హోటల్‌ (నేటి మారియట్‌)లో నిర్వహించగా, ఈసారి మాదాపూర్‌లోని నోవాటెల్‌లో ఏర్పాటు చేశారు. నాటి సమావేశాల్లో.. తెరాసతో ఎలాంటి పొత్తు ఉండదని భాజపా ప్రకటించింది. ఇప్పుడు అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో భాజపాకు ప్రధాన ప్రత్యర్థి అయ్యింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా కార్యాచరణపై భాజపా దృష్టి సారించింది. అప్పుడు, ఇప్పుడు కేంద్రంలో భాజపానే అధికారంలో ఉండడం విశేషం.


నోవాటెల్‌, రాజ్‌భవన్‌లలో ప్రధాని బస!

కార్యవర్గ సమావేశాల కోసం ప్రధాని మోదీ రెండు రోజులు నగరంలోనే ఉండనున్నందున ఆయన బస ఏర్పాట్లపై ఎస్పీజీ, కేంద్ర నిఘా వర్గాలు, రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు బుధవారం రాత్రి చర్చించారు. జులై 2న మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. అదే రోజు రాత్రి నోవాటెల్‌ హోటల్‌లో బస చేయనున్నట్టు సమాచారం. అక్కడి ప్రెసిడెన్షియల్‌ సూట్‌ను మోదీ కోసం సిద్ధం చేశారు. జులై 3న బహిరంగ సభ అనంతరం ఆ రోజు రాత్రి ప్రధాని రాజ్‌భవన్‌లో బస చేస్తారని తెలుస్తోంది. ఆయన చార్మినార్‌ సమీపంలోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించనున్నారని కూడా భాజపా నాయకులు చెబుతున్నారు. మోదీ 4న బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్‌కు పయనమవుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని