భాజపా, తెరాస ప్రచార యుద్ధం

భాజపా, తెరాసల మధ్య పోటాపోటీగా ప్రచారయుద్ధం సాగుతోంది. ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘సాలు దొర - సెలవు దొర’ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి హైదరాబాద్‌లోని భాజపా

Updated : 30 Jun 2022 06:54 IST

 పోటాపోటీగా హోర్డింగులు

ఈనాడు, హైదరాబాద్‌, గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే:  భాజపా, తెరాసల మధ్య పోటాపోటీగా ప్రచారయుద్ధం సాగుతోంది. ఒకరినొకరు తీవ్రస్థాయిలో విమర్శించుకుంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. ‘సాలు దొర - సెలవు దొర’ అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో, ఇతర ప్రదేశాల్లో ఫ్లెక్సీలు కట్టారు. దీనికి ప్రతిగా తెరాస ‘సాలు మోదీ... సంపకు మోదీ... బైబై మోదీ’ అంటూ పరేడ్‌ మైదానం తదితర ప్రాంతాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. రైతు చట్టాలు, లాక్‌డౌన్‌ పరిణామాలు, ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం, పెద్ద నోట్ల రద్దు వంటి అంశాలను అందులో పేర్కొంది. పరేడ్‌ మైదానం సమీపంలో ఏర్పాటు చేసిన ఇలాంటి ఫ్లెక్సీని కంటోన్మెట్‌ బోర్డు సిబ్బంది తొలగించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా భాజపా నగరంలోని వివిధ ప్రదేశాల్లో ప్రచార బ్యానర్లు కడుతుండగా, మరోవైపు తెరాస పోటాపోటీగా తమ పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎనిమిదేళ్ల తెరాస పాలన, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో నగరవ్యాప్తంగా భారీఎత్తున హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. భాజపా సభ నిర్వహించే పరేడ్‌ మైదానం వద్ద కూడా తెరాస ఫ్లెక్సీలు కట్టారు. దీంతో భాజపా మిగిలిన ప్రధాన కూడళ్లలోనూ ప్రధాని తదితరుల చిత్రాలతో హోర్డింగులు, జెండాలు ఏర్పాటు చేసింది..

* హైదరాబాద్‌లో కొన్నిచోట్ల భాజపా ఏర్పాటు చేసిన ప్రచార ఫ్లెక్సీలు, బ్యానర్లకు అనుమతి లేదంటూ ఫిర్యాదులు రావడంతో జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం జరిమానాలు విధించింది. ఆ పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌పై ఏర్పాటు చేసిన కౌంట్‌ డౌన్‌ బోర్డుకు రూ.50 వేలు జరిమానా విధించారు. మరికొన్ని ప్రాంతాల్లో పెట్టిన వాటికీ జరిమానాలు విధించారు.

అభద్రతాభావంతోనే ఫ్లెక్సీ రాజకీయాలు: లక్ష్మణ్‌

సీఎం కేసీఆర్‌ అభద్రతాభావంతోనే ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నగరంలో ఫ్లెక్సీలతో రాజకీయం చేస్తున్నారని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. భాజపా కార్యవర్గ సమావేశాల తర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారనుందని తెలిపారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ అవినీతిలేని పాలన తమ పార్టీతోనే సాధ్యమని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని