Updated : 01 Jul 2022 09:39 IST

Uddhav thackeray: ఉద్ధవ్‌ లెక్క తప్పిందెక్కడ?

సీఎం పదవికి రాజీనామా చేసేందుకు రాజ్‌భవన్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే తానే స్వయంగా డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని కారును నడుపుకొంటూ వెళ్లారు. ఒక రకంగా ప్రభుత్వాధినేతగా కూడా ఠాక్రే అదే పని చేశారు. అన్ని బాధ్యతలను తానే నిర్వహించి, పార్టీలో రగులుతున్న అసంతృప్తిని, తిరుగుబాటును గుర్తించలేకపోయారు. కానీ శివసేన వ్యవస్థాపకుడు.. ఉద్ధవ్‌ తండ్రి బాలాసాహెబ్‌ మాత్రం ఎన్నడూ ఆ పనిచేయలేదు. సీఎం పదవిలో కూర్చొనే అవకాశం వచ్చినా, వెనుక సీట్లోనే కూర్చునే ప్రభుత్వాన్ని నడిపారు. ఆ తండ్రి బాటను వీడడమే ఠాక్రే కొంప ముంచింది. ఆయన రాజకీయ లెక్కలను తారుమారు చేసింది.

హారాష్ట్ర రాజకీయాల్లో శివసేన వ్యవస్థాపక అధ్యక్షుడు బాలాసాహెబ్‌ ఠాక్రేది విలక్షణ శైలి. ఆయన కింగ్‌ మేకర్‌గా వ్యవహరించారు తప్ప ఎన్నడూ తానే రాజు కావాలనుకోలేదు. 1995లో అవకాశం వచ్చినా ముఖ్యమంత్రి గద్దెనెక్కలేదు. ఆ బాధ్యతలను మనోహర్‌ జోషీకి అప్పగించారు. ప్రభుత్వ వైఫల్యాల ప్రభావం తనపై పడకుండా ఠాక్రే జాగ్రత్తలు తీసుకున్నారు. తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపారు. సీఎంగా మనోహర్‌ జోషి విఫలమైనా ఆ ప్రభావం బాలాసాహెబ్‌పైౖ పడలేదు. అందుకే ఆయన జోషిని తప్పించి నారాయణ రాణెను సునాయాసంగా ముఖ్యమంత్రి పీఠం ఎక్కించగలిగారు. ఉద్ధవ్‌ ఠాక్రే మాత్రం ఇందుకు భిన్నమైన దారి ఎంచుకున్నారు. తానే సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. ఇదే ఉద్ధవ్‌ను దెబ్బతీసింది. ఆయనే సీఎం కావడంతో ప్రతిపక్షాల నుంచే కాదు.. సొంత పార్టీ నేతల నుంచీ విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. తండ్రి వ్యూహం అనుసరించి సీఎం పీఠం.. వేరొకరికి ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేదే కాదంటున్నారు విశ్లేషకులు. దీనికి తోడు కొడుకు ఆదిత్య ఠాక్రేను మంత్రిమండలిలోకి తీసుకోవడంతో పక్షపాతం, వారసత్వ రాజకీయాల ఆరోపణలను ఠాక్రే ఎదుర్కొవాల్సి వచ్చింది.

ఆ దూకుడు లేదు

శివసేనలో బాలాసాహెబ్‌ ఠాక్రే మాటే వేదవాక్కు. ఆయన మాటకు ఎదురు చెప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు. ఠాక్రే చిటికేస్తే ముంబయి స్తంభించేది. జాతీయ పార్టీ నేతలు సైతం ముంబయి వస్తే.. బాలాసాహెబ్‌ నివాసమైన మాతోశ్రీని సందర్శించాల్సిందే. అప్పట్లో దిల్లీ రాజకీయాల్లో చక్రం తిప్పిన మహారాష్ట్ర నేత శరద్‌ పవార్‌ కూడా ఠాక్రే ఇంటికి వెళ్లి కలిసేవారు. ఆ రకమైన అధికారం శివసేన అధినేత చెలాయించారు. ఉద్ధవ్‌ ఠాక్రే.. ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. సీఎంగా 31 నెలల పాలనలో ఎక్కడా దూకుడుగా వ్యవహరించలేదు. అధికారపీఠంపై తానున్నా కాంగ్రెస్‌, శివసేన, ఎన్‌సీపీ ఉమ్మడిగా ఏర్పాటు చేసిన మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి శరద్‌ పవారే కీలకమన్న భావన కలిగించారు. ప్రభుత్వంలో ఏ సంక్షోభం వచ్చినా ఎన్సీపీ అధినేతే తెర ముందు కనిపించేవారు. దీంతో సొంత ఎమ్మెల్యేల్లోనూ ఠాక్రేపై చులకన భావం ఏర్పడింది. ఇదే చివరకు తిరుగుబాటుకు దారి తీసింది. ప్రభుత్వాధినేతగా ఉద్ధవ్‌ మంచిపేరు తెచ్చుకున్నా, పార్టీని విస్మరించడం, చాలా మంది సీనియర్లు ఉన్నా, సంజయ్‌ రౌత్‌ లాంటి నాయకుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కొంప ముంచింది.

హిందుత్వ దెబ్బ!

2019 ఎన్నికల ముందు భాజపాతో తెగదెంపులు చేసుకొని కాంగ్రెస్‌ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వం ఏర్పరిచి ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రి అవుతారని మహారాష్ట్రలో ఎవరూ ఊహించలేదు. శివసేన అంటే హిందుత్వ భావజాలానికి ప్రతిరూపంగా ఆ రాష్ట్రంలో చాలా మంది భావించేవారు. అలాంటి పార్టీ.. కాంగ్రెస్‌, ఎన్‌సీపీలతో జతకలవడం చాలా మందికి మింగుడుపడలేదు. కరడుగట్టిన హిందుత్వను ఎప్పుడూ అవలంబించే శివసేన కార్యకర్తలకు ఉద్ధవ్‌ అనుసరించిన మృదు హిందుత్వ నచ్చలేదు. రాజీనామా చేస్తూ.. ఆఖరి నిమిషంలో ఔరంగాబాద్‌ పేరును శంబాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ పేరును దారాశివ్‌గా మార్చినా.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని