Eknath Shinde: సీఎం సీట్లో ఆటోడ్రైవర్‌

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసి.. ఆటో డ్రైవర్‌గా పనిచేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఏక్‌నాథ్‌ శిందే. మహారాష్ట్రలోని ఠాణేలో కార్పొరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా

Updated : 01 Jul 2022 07:24 IST

ఏక్‌నాథ్‌ శిందే రాజకీయ ప్రస్థానం

ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి.. ఆర్థిక కారణాలతో చదువును మధ్యలోనే ఆపేసి.. ఆటో డ్రైవర్‌గా పనిచేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి ఏక్‌నాథ్‌ శిందే. మహారాష్ట్రలోని ఠాణేలో కార్పొరేటరుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి.. 4 సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా పనిచేసిన ఏక్‌నాథ్‌.. శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్‌కు ప్రియశిష్యుడు కూడా.

ఏక్‌నాథ్‌ శిందే.. మహారాష్ట్ర రాజకీయాల్లో 2014కు ముందు సుపరిచితమైన పేరు కాదు. అప్పటికి ఆయన ఠాణె, పాల్ఘర్‌ జిల్లాలకు పరిమితమైన నేత మాత్రమే. 2014లో భాజపా, శివసేన ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడం.. ఆయన రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పింది. 1964 ఫిబ్రవరి 9న సతారా జిల్లాలో జన్మించిన శిందే విద్యాభ్యాసం ఠాణె జిల్లాలో జరిగింది. అదే ఆయన రాజకీయ కర్మభూమిగా మారింది. ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన శిందే.. కుటుంబానికి అండగా నిలిచేందుకు ఆటోడ్రైవర్‌ అయ్యారు. ఆరెస్సెస్‌ శాఖలో శిక్షకుడిగానూ పనిచేశారు. శివసేన ఫైర్‌బ్రాండ్‌ నేత దివంగత ఆనంద్‌ దిఘేతో పరిచయం ఏక్‌నాథ్‌ జీవితాన్ని మలుపు తిప్పింది. పూర్తిస్థాయిలో శివసైనికుడిగా మారారు. అయినా కుటుంబ పరిస్థితుల దృష్యా ఆయన పలు ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. లారీ డ్రైవర్‌గా, కొన్నాళ్లు బీర్లు తయారు చేసే సంస్థలో పనిచేశారు. దిఘే ఆశిస్సులతో 1997లో ఠాణె కార్పొరేషన్‌ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీచేసి నెగ్గడంతో శిందే రాజకీయ ప్రయాణం ఊపందుకుంది. 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా 2009, 2014, 2019లో శాసనసభలో అడుగుపెట్టారు. రెండుసార్లు మంత్రి అయ్యారు. శివసేనను చీల్చేందుకు ఛగన్‌ భుజబల్‌, గణేశ్‌ నాయర్‌, నారాయణ రాణె, రాజ్‌ ఠాక్రే .. లాంటి ప్రముఖ నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారితో పోలిస్తే శిందే పెద్ద నేత కాదు. కరోనా సంక్షోభం, ఉద్ధవ్‌ ఠాక్రే వెన్నెముకకు శస్త్రచికిత్స జరగడం శిందేకు కలిసొచ్చింది. ఆ సమయంలో శిందే ఎమ్మెల్యేలతో సమావేశాలు నిర్వహించి, వారికి దగ్గరయ్యారు.


ఒకానొక దశలో రాజకీయాలకు దూరంగా..

శిందే ఒకానొక సమయంలో రాజకీయాలను వీడారు. 2001లో పడవ ప్రమాదంలో 11 ఏళ్ల కొడుకు, ఏడేళ్ల కుమార్తె చనిపోయారు. దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. ఆ సమయంలో రాజకీయ గురువు ఆనంద్‌ దిఘే మళ్లీ అతణ్ని క్రియాశీలక రాజకీయాల్లోకి తెచ్చారు. ఆ బోటు ప్రమాదం జరిగేటప్పటికి శిందే మరో కొడుకు శ్రీకాంత్‌ వయసు 13 ఏళ్లు. ప్రస్తుతం కల్యాణ్‌ లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రేపై తండ్రి తిరుగుబాటు చేయడంలో శ్రీకాంతే కీలక పాత్ర పోషించారు.


- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని