క్షమాపణ చెప్పాకే మోదీ హైదరాబాద్‌ రావాలి

తెలంగాణ ఏర్పాటు విధానాన్ని తప్పుపడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను అవమానించేలా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  బహిరంగ క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Published : 01 Jul 2022 05:44 IST

 కిషన్‌రెడ్డి, సంజయ్‌లు ముక్కు నేలకు రాయాలి

రేవంత్‌రెడ్డి డిమాండ్‌

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణ ఏర్పాటు విధానాన్ని తప్పుపడుతూ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను అవమానించేలా, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యానించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ  బహిరంగ క్షమాపణ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆ తర్వాతే హైదరాబాద్‌కు రావాలని సూచించారు. మోదీ వ్యాఖ్యలను ఖండించకుండా మౌనంగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లు అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి క్షమాపణలు కోరాలన్నారు. రేవంత్‌రెడ్డి గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెలంగాణను అడ్డుకోవడానికి చివరి క్షణం వరకు శాయశక్తులా ప్రయత్నించిన నరేంద్రమోదీ, భాజపాలు ఇక్కడ ఎందుకు పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టారో తెలంగాణ ప్రజలకు అర్థం కావడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా అనేక హామీలకు కాంగ్రెస్‌ పార్లమెంటులో చట్టబద్ధత కల్పించినా 8 ఏళ్లుగా అమలు చేయకుండా తీరని అన్యాయం చేస్తున్నారు. తెలుగువాళ్లను అవమానిస్తూ హైదరాబాద్‌లో సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారు? విభజన హామీలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. కీలకమైన సమస్యలు ఉన్నప్పుడు పోరాటం చేయాల్సిన కేసీఆర్‌ 8 ఏళ్లు మోదీకి కాపలా కాశారు. ఈ రోజు మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టి చిల్లర పంచాయతీ పెట్టారు. అగ్నిపథ్‌పై ముఖ్యమంత్రి స్పష్టమైన వైఖరి ప్రకటించాలి’’ అని రేవంత్‌ డిమాండ్‌ చేశారు. 

సిన్హా మమ్మల్ని మాత్రం కలిస్తేనే..

‘‘రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా 2న హైదరాబాద్‌కు వస్తున్నట్లు సమాచారం ఉంది. ఆయన మమ్మల్ని మాత్రమే కలవడానికి వస్తే అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తాం. విశ్వేశ్వర్‌రెడ్డి  భాజపాలో చేరినా కొద్దిరోజులకే తిరిగి బయటకు వస్తారని అనుకుంటున్నా’’ అని రేవంత్‌ పేర్కొన్నారు. చేప పిల్లల ఉచిత పంపిణీలో జరిగిన కుంభకోణంపై విచారణ జరపాలని రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని