Published : 02 Jul 2022 05:11 IST

‘నారాసుర రక్తచరిత్ర’ అని రాసినందుకు భారతిరెడ్డిని అరెస్ట్‌ చేస్తారా?

వెంకటేష్‌ చేసింది దానికంటే ఘోరమా

పోస్టును ఫార్వర్డ్‌ చేస్తే హింసిస్తారా?

అర్ధరాత్రి గోడదూకి వెళ్లడానికి మీరు పోలీసులా, వైకాపా గూండాలా?

కళంకిత పోలీసులను చట్టం ముందు నిలబెడతాం

తెదేపా అధినేత చంద్రబాబు మండిపాటు

సామాజిక మాధ్యమాల్లో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకే సీఐడీ పోలీసులు ధరణికోటకు చెందిన వెంకటేష్‌ని అరెస్టు చేస్తే... వై.ఎస్‌.వివేకానందరెడ్డిని వాళ్లే చంపేసి, మర్నాడు సాక్షి పత్రికలో ఆ హత్యను నాకు ఆపాదిస్తూ ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ పెద్దగా ఆర్టికల్‌ వేసినవాళ్లను ఏం చేయాలి? ఆ వార్త వేసినందుకు ‘సాక్షి’ ఎండీ భారతిరెడ్డిని అరెస్టు చేస్తారా?

- చంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘సామాజిక మాధ్యమాల్లో ఎవరో పెట్టిన పోస్టును ఫార్వర్డ్‌ చేసినందుకే సీఐడీ పోలీసులు ధరణికోటకు చెందిన వెంకటేష్‌ని అరెస్టు చేస్తే... వై.ఎస్‌.వివేకానందరెడ్డిని వాళ్లే చంపేసి, మర్నాడు సాక్షి పత్రికలో ఆ హత్యను నాకు ఆపాదిస్తూ ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ పెద్దగా ఆర్టికల్‌ వేసినవాళ్లను ఏం చేయాలి? ఆ వార్త వేసినందుకు ‘సాక్షి’ ఎండీ భారతిరెడ్డిని అరెస్టు చేస్తారా? గ్రేట్‌ డీజీపీనీ, గ్రేట్‌ సీఐడీ చీఫ్‌నీ అడుగుతున్నాను... వివేకానందరెడ్డిని ఎవరు చంపారో మీకు తెలీదా? నాపై రాసిన వార్త ఫేక్‌ అని మీకు తెలీదా? ఇప్పుడు వెంకటేష్‌ చేసిన పని దానికంటే ఘోరమైందా? అయినా ఆ పోస్టును వెంకటేష్‌ ఫార్వర్డ్‌ చేస్తే... దాంతో సాంబశివరావుకు ఏం సంబంధం? అతన్నెందుకు చిత్రహింసలు పెట్టారు?’ అని పోలీసులపై తెదేపా అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. సాక్షి పత్రికలో తనపై ప్రచురించిన కథనం ప్రతిని చూపిస్తూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వం కొందరు కళంకితులైన, సైకో ప్రవర్తన కలిగిన పోలీసు అధికారులతో... ప్రశ్నించినవారిపై దాడులు చేయిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులను కొట్టిస్తోందని, అక్రమ కేసులు పెట్టించి వేధిస్తోందని ఆయన శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మండిపడ్డారు. జగన్‌ ప్రవర్తన నచ్చక వైకాపా గౌరవాధ్యక్ష పదవికి వై.ఎస్‌.విజయమ్మ రాజీనామా చేశారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిన పోస్టును ఫార్వర్డ్‌ చేశారంటూ ధరణికోటకు చెందిన వెంకటేష్‌ని, మంగళగిరికి చెందిన సాంబశివరావును సీఐడీ పోలీసులు చిత్రహింసలు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సీఐడీ పోలీసులు తనను ఎలా చిత్రహింసలకు గురిచేసిందీ సాంబశివరావుతో చెప్పించారు.

తప్పు చేసిన ఏ పోలీసునూ వదలం
‘కొందరు పోలీసులు ప్రభుత్వానికి ఊడిగం చేయాలనుకుంటున్నారు.. చేసుకోండి. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం. ఎన్ని వేలమందిని పోలీసు కస్టడీలో పెట్టి కొడతారో మేమూ చూస్తాం. మా పోరాటం పోలీసులపై కాదు... మాది రాజకీయ పోరాటం. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తాం. ప్రజావ్యతిరేక కార్యక్రమాలతో విభేదిస్తాం. ఆ క్రమంలో పోలీసులు మాకు అడ్డు తగలాలనుకుంటే వాళ్లను చట్టం ముందు నిలబెడతాం. ఈ రోజుతో అంతా అయిపోయిందని అనుకోవద్దు. పోలీసులకు ఇదే నా హెచ్చరిక. ఖబడ్దార్‌... అవసరమైతే నేనే పోలీసుస్టేషన్‌కి వచ్చి బాధితులకు అండగా నిలబడతాను. పోలీసుల అరాచకాల్ని అక్కడే నిలదీస్తాను. చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తాం’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు.

పరాకాష్ఠకు సీఐడీ వికృత చేష్టలు
‘సీఐడీ వికృత చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల్నీ లెక్క చేయడం లేదు. వాళ్ల నిర్వాకాలపై కోర్టులో కేసులున్నా... భయం లేదు. వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలు పెట్టి చంపేందుకు ప్రయత్నించారు. ఇక్కడైతే ప్రభుత్వం వైద్యపరీక్షల ఫలితాల్ని మార్చేస్తుందని, కోర్టు ఆయనను ఆర్మీ ఆస్పత్రికి పంపింది. వైకాపా ప్రభుత్వానికి సిగ్గు, ఎగ్గు ఉంటే ఆ రోజే రాజీనామా చేసేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిని చిత్రహింసలు పెట్టారు. 600 మందిపై కేసులు పెట్టి, 41(ఎ) నోటీసు ఇవ్వకుండా 120 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు వెంకటేష్‌, సాంబశివరావుల విషయంలో సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు వారి పిచ్చికి పరాకాష్ఠ’ అని మండిపడ్డారు.

సాంబశివరావును కులం అడగాల్సిన అవసరమేంటి?
‘40 ఏళ్ల నా రాజకీయ అనుభవంలో ఇంత నీచమైన పరిపాలన ఎప్పుడూ చూడలేదు’ అని మండిపడ్డారు. ‘సాంబశివరావు భార్య బాలింత. అమె బిడ్డకు పాలు ఇస్తుంటే పోలీసులు ఆ గదిలోకి ఎలా వెళ్తారు? దీనికి డీజీపీ, సీఐడీ అధిపతి సమాధానం చెప్పాలి. సీఐడీ పోలీసులు సాంబశివరావును కొడుతూ... కాపు కులంలో పుట్టి తెదేపా కోసం ఎలా పనిచేస్తున్నావురా? అని అతన్ని అడిగారు. పోలీసులకేమైనా పిచ్చి పట్టిందా? సైకో పాలనలో మీరు కూడా సైకోల్లా మారారా?’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సాంబశివరావును తెదేపా ఆఫీసులో పనిచేస్తున్నాడని కొట్టారు. మీరు కొడితే మా ఆఫీసులో ఎవరూ పనిచేయరని అనుకుంటున్నారా?’ అని మండిపడ్డారు.

అర్ధరాత్రి గోడలు దూకుతారా..?
‘సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులపై అభ్యంతరముంటే 41(ఎ) నోటీసు ఇవ్వాలిగానీ, అరెస్టు చేయడమేంటి? వెంకటేష్‌కి 41(ఎ) నోటీసు ఇవ్వడానికి అర్ధరాత్రి వెళ్లాలా? అర్ధరాత్రి గోడలు దూకి వెళ్లడానికి మీరేమైనా దొంగలా? రౌడీలా? వైకాపా గూండాలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐ జగదీష్‌ నేరచరిత్ర గురించి ఒక బాధితురాలి ఆవేదన వీడియో చిత్రాన్ని ప్రదర్శించారు.

అర్ధరాత్రి పోలీసులు వస్తే మాకు చెప్పండి
సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారంటూ 41(ఎ) నోటీసు ఇవ్వడానికి ఎవరింటికైనా అర్ధరాత్రి పోలీసులు వచ్చినా, వేధించినా పార్టీ కార్యాలయానికి తెలియజేస్తే వెంటనే న్యాయవాదుల్ని పంపిస్తామని, వారి సమక్షంలోనే నోటీసు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు.


సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌ మహిళల జీవితాలతో ఆడుకున్నారు
బాధితురాలి ప్రసంగ వీడియో ప్రదర్శించిన చంద్రబాబు

గుంటూరు జిల్లా ధరణికోటకు చెందిన వెంకటేష్‌ ఇంట్లో అర్ధరాత్రి దౌర్జన్యం చేసిన సీఐడీ ఇన్‌స్పెక్టర్‌ జగదీష్‌ ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నారని మల్లవరపు సింధూర అనే బాధితురాలు ఆరోపించారు. ఆయన్ను అడ్డం పెట్టుకుని రౌడీయిజం చేయిస్తున్నారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ‘జగదీష్‌.. మీ వ్యక్తిత్వం, మీ చరిత్ర అందరికీ తెలిసిందే. మీరు ఎన్ని అరాచకాలు చేశారో, ఎంతమంది రౌడీషీటర్లు మీకు స్నేహితులో అన్నీ తెలుసు. పల్నాడు జిల్లాలోనూ ఎంతోమంది మహిళల జీవితాల్ని నాశనం చేశారు’ అని మండిపడ్డారు. ఆమె ప్రసంగం వీడియోను తెదేపా అధినేత చంద్రబాబు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నరసరావుపేట గ్రామీణ పోలీసుస్టేషన్‌ ఎస్‌హెచ్‌వోగా పనిచేసిన సమయంలో జగదీష్‌ అక్కడ ఫిర్యాదు ఇవ్వటానికి వెళ్లిన సింధూరను వంచించి మోసగించారని వివరించారు.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని