చంద్రబాబు చావోరేవో తేల్చుకుంటారు

రాబోయే ఎన్నికల్లో చావోరేవో అన్నట్టుగా చంద్రబాబు రంగంలోకి దిగుతారని, ఎదుర్కొనేందుకు వైకాపా శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

Updated : 02 Jul 2022 08:11 IST

ఎదుర్కొనేందుకు వైకాపా శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సజ్జల

ఈనాడు, అమరావతి: రాబోయే ఎన్నికల్లో చావోరేవో అన్నట్టుగా చంద్రబాబు రంగంలోకి దిగుతారని, ఎదుర్కొనేందుకు వైకాపా శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో శుక్రవారం జరిగిన ఎన్టీఆర్‌ జిల్లా వైకాపా ప్లీనరీలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు అన్ని రకాల శక్తులనూ ఏకం చేసుకుని వచ్చే ఎన్నికలకు వస్తారన్నారు. జగన్‌ను ఓడించాలని చంద్రబాబు చేసే కుట్రలను వైకాపా శ్రేణులు ఛేదించాలన్నారు. ఆయన హయాంలో జరిగిన అన్యాయం, నిరంకుశత్వం, మాఫియా ముఠా పాలనకు విజయవాడ పరిసర ప్రాంతాలే చిహ్నంలా కనిపిస్తాయని సజ్జల విమర్శించారు. విజయవాడలో కనీసం పైవంతెనలను కూడా చంద్రబాబు నిర్మించలేకపోయారని అన్నారు. కనకదుర్గ, బెంజిసర్కిల్‌ పైవంతెనలను జగన్‌ ప్రభుత్వం పూర్తిచేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పాయన్నారు. రూ.5 లక్షల కోట్లతో రాజధాని నిర్మిస్తామంటూ ప్రకటించిన చంద్రబాబు.. కనీసం 5కిలోమీటర్ల పైవంతెన కూడా విజయవాడలో పూర్తిచేయలేక పోయారంటూ ఎద్దేవా చేశారు. విజయవాడను బాగుచేస్తే చంద్రబాబు పాలన బాగుంటుందని అందరూ అనుకుంటారనే ఆలోచన కూడా ఆయనకు లేదని విమర్శించారు. రాజధాని పేరుతో రైతుల భూములు అడ్డంగా లాక్కుని వాటిని తన విదేశీ బినామీ సంస్థలకు అప్పగించి రూ.లక్ష కోట్లు దోచుకోవాలని చంద్రబాబు చూశారని సజ్జల ఆరోపించారు. ఈ మోసాన్ని గ్రహించిన జనం చంద్రబాబు కుమారుడిని కూడా మంగళగిరిలో ఓడించారన్నారు. ఇంకా అమరావతి అంటూ ప్రజలను మోసగించాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని భ్రమను కలిగిస్తున్నారని అన్నారు.


రెండు హాళ్లు బోసిపోయి!

ఎన్టీఆర్‌ జిల్లా వైకాపా ప్లీనరీని మూడు హాళ్లున్న కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించారు. ఇందులో ఓ హాల్లో సమావేశం జరిగింది. మిగతా రెండు హాళ్లలో ఎల్‌ఈడీ తెరలను పెట్టి.. కార్యకర్తలు, నాయకులు కూర్చోవడానికి కుర్చీలు వేశారు. కానీ రెండు హాళ్లలో జనం పలుచగా కనిపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే సమయంలో కుర్చీలు ఖాళీగా కనిపించాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని