మద్యంపై సర్కారు మాట్లాడదేం?: అనిత

‘‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగుతున్న ప్రతి ఒక్కరూ డబ్బులిచ్చి విషాన్ని కొంటున్నారు. చావు కొని తెచ్చుకుంటున్నారు. చాలా మంది కారణం తెలియకుండానే

Published : 02 Jul 2022 05:11 IST

ఈనాడు, అమరావతి: ‘‘ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దుకాణాల్లో మద్యం తాగుతున్న ప్రతి ఒక్కరూ డబ్బులిచ్చి విషాన్ని కొంటున్నారు. చావు కొని తెచ్చుకుంటున్నారు. చాలా మంది కారణం తెలియకుండానే చనిపోతున్నారు’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. ‘‘ఆంధ్రా గోల్డ్‌, 9సీ హార్సెస్‌, సిల్వర్‌ స్ట్రైప్స్‌ వంటి విస్కీ బ్రాండ్లలో విషపదార్థాలు ఉన్నాయంటూ ఎస్‌జీఎస్‌ ల్యాబ్‌ ఇచ్చిన నివేదిక మేం విడుదల చేసి వారం రోజులైంది. ఇది నిజం కాకపోతే ఆ విషయాన్ని వైద్య ఆరోగ్య, ఎక్సైజ్‌ శాఖ మంత్రులు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కనీసం ఆ శాఖల ఉన్నతాధికారులైనా ఆ మద్యంలో విష పదార్థాలేవీ లేవని, తాగొచ్చని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు? దీన్నిబట్టి ఆయా మద్యం బ్రాండ్లలో విషపదార్థాలు ఉన్నట్లు ప్రభుత్వం కూడా అంగీకరిస్తున్నట్లే కదా. మేము చెప్పిన మరుసటి రోజు నుంచే ఆ బ్రాండ్ల విక్రయాలు నిలిపేశారు. వాటిలో విషపూరిత రసాయనాలు లేకుంటే ఎందుకు విక్రయాలు ఆపారో సమాధానం చెప్పాలి’’ అని పేర్కొన్నారు. మంగళగిరిలోని తెదేపా ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘‘అదాన్‌ డిస్టిలరీ ఎప్పుడు వచ్చింది? ఎస్‌పీవై డిస్టిలరీ  ఎవరి గుప్పిట్లో ఉంది? ఎస్‌ఎన్‌జే డిస్టిలరీకి వైకాపా నాయకులకు ఉన్న సంబంధాలేమిటి? ఎంఎస్‌ బయోటెక్‌, జేఆర్‌ అసోసియేట్స్‌ రెండూ ఒకే చిరునామాలో ఉండటం వెనుక ఉన్న లొసుగులేమిటి?’’ అనే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలో వచ్చాయంటూ సంబంధంలేని విషయాలు మాట్లాడుతున్నారు. జగన్‌ హయాంలో తయారైన మద్యం బ్రాండ్లు ఏపీలో తప్ప.. పక్క రాష్ట్రమైన తెలంగాణతో పాటు ఏ రాష్ట్రంలోనూ ఎందుకు కనిపించవు? మేము ప్రశ్నించిన విషయాలకు సమాధానం చెప్పకుండా వాటితో ఏ సంబంధమూ లేని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు’ అని అనిత ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని