Updated : 02 Jul 2022 06:58 IST

కదలి వచ్చిన కాషాయసేన

జేపీ నడ్డాకు భారీ ర్యాలీతో స్వాగతం

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, శంషాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌కు వచ్చిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. శుక్రవారం సాయంత్రం శంషాబాద్‌లో నిర్వహించిన భారీ రోడ్డు షోలో నడ్డా పాల్గొన్నారు.హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల నుంచి పెద్దఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. నడ్డా మధ్యాహ్నం 3.30 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం నాలుగు గంటలకు రోడ్డు షోలో పాల్గొంటారని పార్టీ తొలుత ప్రకటించింది. అయితే రెండు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.40 గంటలకు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కాసేపు నాయకులతో మాట్లాడిన తర్వాత సాయంత్రం 6.30 గంటలకు శంషాబాద్‌ పట్టణంలోని ట్రైడెంట్‌ హోటల్‌ ప్రాంతానికి చేరుకున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, ఓబీసీ సెల్‌ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్‌, సీనియర్‌ నాయకురాలు విజయశాంతి, పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్కా నర్సింహారెడ్డితో కలిసి అక్కడ ఏర్పాటు చేసిన ఓపెన్‌ టాప్‌ జీపుపైకి నడ్డా చేరుకున్నారు. రెండున్నర గంటలు ఆలస్యమైనా.. పార్టీ అధ్యక్షుడికి స్వాగతం పలికేందుకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో వేచి ఉన్నారు. అక్కడి నుంచి బస్‌స్టాండ్‌ చౌరస్తా వరకు అరకిలోమీటరు మేరకు గంటసేపు ర్యాలీ సాగింది.  

మహిళల కోలాటాలు.. గజమాలలు..

మహిళల కోలాటాలు... డప్పు వాయిద్యాలు.. విభిన్న వేషధారణలతో కార్యకర్తల విన్యాసాలు.. బాణసంచా పేలుళ్ల మధ్య రోడ్డు షో సాగింది. నడ్డాను చూసేందుకు భారీఎత్తున జనం రోడ్లపైకి చేరుకున్నారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ.. గులాబీ పూలు చల్లుతూ శ్రేణులను ఉత్సాహపరిచారు. రెండు చోట్ల ప్రత్యేకంగా క్రేన్లు ఏర్పాటు చేసి గజమాలలతో అధినేతను సన్మానించారు. నడ్డా రోడ్డు షో కారణంగా శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకునే మార్గంలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. ఎయిర్‌పోర్టుతోపాటు బెంగళూరు జాతీయ రహదారిపై వచ్చే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

విమానాశ్రయంలో నేతల స్వాగతం

తొలుత విమానాశ్రయంలో నడ్డాకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీలు కె.లక్ష్మణ్‌, ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, సీనియర్‌ నేతలు డీకే అరుణ, విజయశాంతి, జితేందర్‌రెడ్డి, వివేక్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్వాగతం పలికారు.


ప్రధానికి స్వాగతం పలకనున్న తలసాని

రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి శనివారం బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ స్వాగతం పలకనున్నారు. నాలుగో తేదీన వీడ్కోలు కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని