Published : 02 Jul 2022 06:42 IST

నేడు యశ్వంత్‌సిన్హా రాక

భారీగా తెరాస స్వాగత ఏర్పాట్లు

ఈనాడు, హైదరాబాద్‌; ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయనకు మద్దతు ఇస్తున్న తెరాస భారీఎత్తున స్వాగతసత్కారాలకు ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 11 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి వస్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు, నగర నేతలు ఘనంగా స్వాగతం పలుకనున్నారు. బేగంపేట, రాజ్‌భవన్‌, ఖైరతాబాద్‌ మీదుగా జలవిహార్‌ వరకు వాహనాలతో ర్యాలీ నిర్వహించనున్నారు. పీవీ మార్గ్‌లోని...జలవిహార్‌లో యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా తెరాస ప్రజాప్రతినిధుల సమావేశం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌, యశ్వంత్‌లు ఈ సందర్భంగా ప్రసంగిస్తారు. ఆ తర్వాత మజ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలను యశ్వంత్‌సిన్హా కలుస్తారు. ఆయన రాకను పురస్కరించుకొని విమానాశ్రయం నుంచి జలవిహార్‌ వరకు పెద్దఎత్తున హోర్డింగులు, స్వాగత ద్వారాలు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు.

ప్రజలు భాజపాను నమ్మే స్థితిలో లేరు: తలసాని

జలవిహార్‌లో జరిగే సభ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పరిశీలించారు. ప్రజలు భాజపాని నమ్మే పరిస్థితిలో లేరని, కేంద్రంలో ఆ పార్టీని మార్చాలని కోరుకుంటున్నారని ఈ సందర్భంగా వారన్నారు. గతంలో పరేడ్‌ గ్రౌండ్‌లో తెరాస సభకు అనుమతి కోరితే రాజకీయ పార్టీల సభకు అనుమతించబోమని చెప్పారని, నేడు భాజపా సభకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో డిప్యూటీ స్పీకర్‌ పద్మారావుగౌడ్‌, హోంమంత్రి మహమూద్‌అలీ, మేయర్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలత, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌, ఎమ్మెల్సీ ప్రభాకర్‌లతో పాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు రావుల శ్రీధర్‌రెడ్డి, గజ్జెల నగేష్‌, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ తెరాస ఇన్‌ఛార్జి తలసాని సాయి కిరణ్‌ యాదవ్‌ తదితరులు ఉన్నారు.

భేటీకి కాంగ్రెస్‌ దూరం  

యశ్వంత్‌ సిన్హాతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు భేటీ కావడం లేదు. యశ్వంత్‌ కార్యాలయ అధికారులు హైదరాబాద్‌లోని కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడగా ఈ విషయం చెప్పినట్లు తెలిసింది. తెరాసతో సమావేశ అనంతరం తాము భేటీ కావడం తప్పుడు సంకేతాలు ఇస్తుందని, మరో రోజు కలుస్తామని కాంగ్రెస్‌ నేతలు చెప్పినట్లు సమాచారం.

2 గంటల తేడాలో... యశ్వంత్‌, మోదీ

యశ్వంత్‌ సిన్హా ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి వస్తుండగా... ఆ తర్వాత 2.45 గంటల తేడాలో మధ్యాహ్నం 1.45కి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అదే విమానాశ్రయానికి చేరుకోనున్నారు.  

నాడు అలా....నేడు ఇలా

యశ్వంత్‌సిన్హా యాదృచ్ఛికంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో హైదరాబాద్‌లో ఉంటున్నారు. 18 ఏళ్ల క్రితం 2004లో హైదరాబాద్‌లో మొదటిసారిగా జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పాలు పంచుకున్నారు. నాటి ప్రధాని వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో యశ్వంత్‌సిన్హా విదేశాంగమంత్రిగా ఉంటూ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. నేడు ఎన్డీయేతర విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన ప్రచార నిమిత్తం హైదరాబాద్‌ వస్తున్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని