Published : 02 Jul 2022 06:15 IST

గౌరవెల్లి రైతులపై కేసులు ఉపసంహరించుకోవాలి

నిర్వాసితులు కోరిన పరిహారం చెల్లించాలి
సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: గౌరవెల్లి రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఎం కేసీఆర్‌ను పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. నిర్వాసితులు కోరుకున్నట్లు పరిహారం ఇవ్వాలని, ఆ తర్వాతే ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు. లేకపోతే నిర్వాసితుల పక్షాన కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు రేవంత్‌రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణలో ప్రాజెక్టులు, రైతుల పొలాలకు నీళ్ల పేరుతో మీరు చేస్తున్న అరాచకాలు హద్దులు దాటుతున్నాయి. కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైన గౌరవెల్లి ప్రాజెక్టులో తొలుత ఒక్క గూడాటిపల్లి గ్రామం మాత్రమే ముంపునకు గురైంది. రీడిజైన్‌ ఫలితంగా అదనంగా మరో ఏడు గ్రామాలు.. తెనుగుపల్లి, మదల్లపల్లి, సోమాజితండా, చింతల్‌తండా, పొత్తపల్లి, జాలుబాయి తండా, తిరుమల్‌ తండాలు మునిగిపోతున్నాయి. తెలంగాణలో ఏ మూలకు పోయినా ఎకరా ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షలకు తక్కువ లేదని మీరే చెబుతున్నారు. మరి గౌరవెల్లి నిర్వాసితుల భూములకు ఆ ధర ఎందుకు వర్తింపచేయడం లేదు? పునరావాసానికి సంబంధించి కొందరికి ఎకరాకు రూ.2.10 లక్షలు, మరికొందరికి రూ.6.90 లక్షలు పరిహారం అందించినట్లు మీ అధికారులే చెబుతున్నారు. ప్రాజెక్టు పనులు ప్రారంభించి 8 ఏళ్లవుతున్నా 186 మందికి అసలు పరిహారమే అందలేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైనర్లుగా ఉండి తర్వాత మేజర్లయిన వారిని కుటుంబంగా పరిగణించి ఒక్కొక్కరికీ రూ.8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, 2013 భూసేకరణ చట్టంప్రకారం పరిహారం ఇవ్వాలని నిర్వాసితులు కోరుతున్నారు. గతంలో ఖమ్మంలో ఆదివాసీ మిర్చి రైతులకు సంకెళ్లు వేశారు. ఇప్పుడు గౌరవెల్లి రైతులకు బేడీలు వేసి వారి ఉసురు పోసుకుంటున్నారు. దీనికి కర్త, కర్మ అయిన మీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని లేఖలో పేర్కొన్నారు.

సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులకు స్టైపెండ్‌ విడుదల చేయాలి: డా.శ్రావణ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణలో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్ల సమస్య పరిష్కరించాలని ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ ఛైర్మన్‌ డా.శ్రావణ్‌కుమార్‌ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి తదితరులతో కలిసి ఆయన శుక్రవారం గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కొవిడ్‌ సమయంలో సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు సేవలందించారని.. ఆర్నెల్లుగా స్టైపెండ్‌ అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. వీరి సమస్య పరిష్కరించాలని మంత్రి హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని