విభజన చట్టం అమలుపై హామీ ఇవ్వండి

రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తక్షణమే అమలుచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ‘భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం

Published : 02 Jul 2022 06:15 IST

ప్రధాని మోదీకి భట్టి లేఖ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర పునర్విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను తక్షణమే అమలుచేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ‘భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైదరాబాద్‌ వస్తున్న మీరు.. విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలని సీఎల్పీ నేతగా కోరుతున్నా’నన్నారు. ఈ మేరకు భట్టి ప్రధానికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు. ‘‘రాష్ట్రం కోసం అనేక పోరాటాలు, ఆందోళనలు జరిగాయి. అనేకమంది ప్రాణత్యాగాలు చేశారు. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా, కాంగ్రెస్‌కు రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసి కూడా సోనియాగాంధీ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుని ప్రజల ఆకాంక్ష నెరవేర్చారు. 2014 ఏపీ పునర్విభజన చట్టం ఆమోదం పొంది 8 ఏళ్లవుతున్నా, వాటిలో పొందుపరిచిన ఒక్క హామీ అమలుకు నోచుకోలేదు. మీరు అనేకసార్లు హైదరాబాద్‌ వచ్చినా వాటి గురించి ప్రస్తావించకపోగా.. రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే తప్పుపడుతూ మాట్లాడటం ఇక్కడి ప్రజల మనోభావాలను గాయపరిచింది. మీరు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తెలంగాణ ప్రాంతంలోని 7 మండలాలు, సుమారు 2 లక్షల ఎకరాల భూమి, సీలేరు జలవిద్యుత్‌ ప్రాజెక్టును ఏపీకి అప్పగించారు. హైదరాబాద్‌ వస్తున్న సందర్భంగా కనీసం ఇప్పుడైనా విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలు చేస్తానని చెప్పాలని కోరుతున్నా. లేదంటే చట్టసభలపై ప్రజలకు విశ్వాసం పోతుంది. మీ ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపిస్తోందని అర్థమవుతుంది’’ అని భట్టి లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చచ్చిపోయిందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను చంపడం ఎవరితరమూ కాదన్నారు. కొండా తన వ్యాపార స్వలాభం కోసం భాజపాలో చేరుతున్నారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ వ్యాఖ్యానించారు.

గుడాటిపల్లి ఘటనపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు: టి.జీవన్‌రెడ్డి

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట్‌ రెవెన్యూ మండలం పరిధిలోని గుడాటిపల్లి గ్రామస్థులపై పోలీసులు అమానవీయంగా వ్యవహరించారంటూ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామస్థులపై జూన్‌ 12 అర్ధరాత్రి, 13వతేదీ తెల్లవారుజామున పోలీసులు వ్యవహరించిన తీరును వివరిస్తూ కమిషన్‌ ఛైర్మన్‌కు శుక్రవారం లేఖ రాశారు. లేఖ ప్రతులను తెలంగాణ సీఎస్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ(హోం), డీజీపీలకు పంపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని