కుటుంబ రాజకీయాలు.. అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లండి

జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు వచ్చిన జాతీయ నేతలు, సీఎంలు, ఎంపీలు రాష్ట్రాన్ని రెండోరోజూ చుట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కోటి చొప్పున 119 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, యువమోర్చా

Published : 02 Jul 2022 06:15 IST

భాజపా స్థానిక నేతలకు జాతీయ నాయకుల దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం తెలంగాణకు వచ్చిన జాతీయ నేతలు, సీఎంలు, ఎంపీలు రాష్ట్రాన్ని రెండోరోజూ చుట్టేశారు. ఒక్కొక్కరు ఒక్కోటి చొప్పున 119 నియోజకవర్గాల్లోని పోలింగ్‌ బూత్‌ అధ్యక్షులు, యువమోర్చా నాయకులు, శక్తి కేంద్రాల ఇన్‌ఛార్జిలతో శుక్రవారం వరుస సమావేశాలు నిర్వహించారు. పోలింగ్‌బూత్‌ల వారీగా పార్టీ బలబలాలపై ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా పార్టీ బలబలాల్ని తెలుసుకుంటూ బలమైన నాయకులు ఎవరు? నాయకత్వలోపం ఎక్కడెక్కడ ఉందన్న విషయాల్ని తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్ని.. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి అమలుచేస్తున్న పథకాల విషయంలో తెరాస సర్కారు తీరును ఎండగట్టాలని సూచించారు. కుటుంబ రాజకీయాలను, ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పేర్కొన్నారు. రానున్న ఏడాది సమయం కీలకం అని.. కష్టపడి పనిచేస్తే పార్టీతో పాటు నాయకులకు అవకాశాలు వస్తాయంటూ దిశానిర్దేశం చేశారు. కేంద్రంలో మరోసారి భాజపా ప్రభుత్వం వస్తుందని..రాష్ట్రంలోనూ భాజపా ప్రభుత్వం ఏర్పడితే డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో తెలంగాణ అభివృద్ధి అవుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. కేంద్ర మంత్రి అజయ్‌భట్‌ ఆర్మూర్‌ నియోజకవర్గంలో, ఉత్తర్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవప్రసాద్‌ మౌర్య అంబర్‌పేటలో, బిలాస్‌పూర్‌ ఎంపీ అరుణ్‌సాహూ పరకాలలో, మరో కేంద్ర మంత్రి సంజీవ్‌ బల్యన్‌ మెదక్‌ అసెంబ్లీ స్థానంలో శుక్రవారం పర్యటించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తెరాస ప్రభుత్వం ఏటీఎంలా మార్చుకుందని సంజీవ్‌ బల్యన్‌ ఆరోపించారు. వచ్చే ఏడాది, ఏడాదిన్నరపాటు కష్టపడి పనిచేయాలని నాయకులకు ఉద్బోధించారు. నియోజకవర్గాలకు వెళ్లిన ఇతర రాష్ట్రాల సీనియర్‌ నేతలు శనివారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిపై జాతీయ నాయకత్వానికి వారు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. 3న పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే నరేంద్రమోదీ సభకు ఆయా నియోజకవర్గాల నుంచి జనసమీకరణపై స్థానిక నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని