CM KCR: తెలంగాణపై కన్నేస్తే.. దిల్లీలో గద్దె దించుతాం!

నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిలా కాకుండా ఓ సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరిస్తున్నారని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని దుయ్యబట్టారు. విద్వేషాలను రెచ్చగొడుతూ భారత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు.

Updated : 03 Jul 2022 06:56 IST

మహారాష్ట్ర మాదిరిగా ఇక్కడా చేస్తామంటే కుదరదు
ప్రధాని కాదు.. ఆయనో సేల్స్‌మ్యాన్‌
మోదీపై.. కేసీఆర్‌ తీవ్ర విమర్శలు
ఆయన పనితీరుతో అంతర్జాతీయంగా భారత్‌ పరువుపోతోందని వ్యాఖ్య
యశ్వంత్‌ రాష్ట్రపతిగా గెలిస్తే దేశ ప్రతిష్ఠ పెరుగుతుంది

ఈనాడు, హైదరాబాద్‌: నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిలా కాకుండా ఓ సేల్స్‌మ్యాన్‌లా వ్యవహరిస్తున్నారని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన పనితీరుతో అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్ఠ దిగజారుతోందని దుయ్యబట్టారు. విద్వేషాలను రెచ్చగొడుతూ భారత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆరోపించారు. మోదీ హయాంలో ఏ రంగమూ బాగుపడలేదని.. ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, రైతులు, సైనికులు, ఉద్యోగులు, నిరుద్యోగులు అందరూ ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెట్రో, గ్యాస్‌, ఎరువులతోపాటు నిత్యావసరాలన్నింటి ధరలనూ పెంచారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని మోదీ సర్కారు ఖూనీ చేస్తోందని.. ఇప్పటి వరకు 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓ కేంద్రమంత్రి అంటున్నారని.. ఇక్కడి సర్కారును కూల్చాలని చూస్తే దిల్లీలో వారిని గద్దె దించుతామని సీఎం కేసీఆర్‌ హెచ్చరించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ప్రచారంలో భాగంగా శనివారం హైదరాబాద్‌ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్‌ ప్రసంగించారు. మోదీ ఎన్నికల సమయాల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదని.. టార్చిలైట్‌ వేసి వెతికినా అమలుచేసినవి కనిపించవన్నారు. తానే శాశ్వతం అనే భ్రమలో మోదీ ఉన్నారని.. కానీ, కేంద్రంలో రాజకీయ మార్పు తప్పకుండా జరుగుతుందని స్పష్టంచేశారు. రాష్ట్రపతిగా యశ్వంత్‌ సిన్హా గెలుపుతో దేశ గౌరవం పెరుగుతుందన్నారు. భాజపాను గద్దెదించి దేశంలో గుణాత్మక మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు.

మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి..

‘‘ప్రధాని హైదరాబాద్‌ వచ్చారు. రెండు రోజులు ఇక్కడే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి, తెరాసకు వ్యతిరేకంగా చాలా చెబుతారు. ఎన్ని ఆరోపణలు చేసినా మాకు వచ్చే నష్టం ఏంలేదు. మేం వేసిన ప్రశ్నలకు హైదరాబాద్‌ వేదికగా సమాధానం చెప్పాలి. ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిల్లో ఒక్కటీ అమలు కాలేదు. వ్యవసాయంలో పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగాయి. డీజిల్‌సహా అన్ని ధరలు విపరీతంగా పెంచేశారు. ఇవి చాలదన్నట్లు వ్యవసాయ చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టారు. వాటికి వ్యతిరేకంగా ఉద్యమించిన అన్నదాతలను జీపులతో తొక్కించారు. తెలంగాణ ప్రభుత్వం పంజాబ్‌ రైతులకు పరిహారం ఇస్తే ప్రధాని, కేంద్రమంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి.. ఆ తర్వాత వెనక్కి తీసుకుని, రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. తప్పుడు నిర్ణయంతో 700 మంది రైతుల ప్రాణాలు పోయినా ప్రధానికి బాధ లేదు.

వికాసం పేరుతో నాశనం

వికాసం పేరుతో మోదీ దేశాన్ని నాశనం చేశారు. ఆయన పాలనలో అంతా తిరోగమనమే.  సామాన్యుడు బతకలేని పరిస్థితి కల్పించారు. నల్లధనం నియంత్రణ కాదు... రెట్టింపైంది. వికాసం అంటే ఇదేనా? అవినీతి రహిత భారత్‌ అని పెద్దపెద్ద మాటలు చెప్పారు.. కానీ, మోదీ పాలనలో అవినీతిపరులు పెరిగారు. భాజపా హయాంలో అన్నీ కుంభకోణాలే. కేంద్ర విధానాల వల్ల ఫియట్‌, ఫోర్డ్‌, జనరల్‌ మోటార్స్‌, డాట్సన్‌ వంటి కంపెనీలు దేశం విడిచి వెళ్లిపోయాయి. ఇదేనా దేశాన్ని పరిపాలించే పద్ధతి?

15 లక్షలు వేస్తామన్నారు.. 15 పైసలూ వేయలేదు..

చైనా 16 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థతో ముందుకెళ్తోంది. భారత్‌లో 5 ట్రిలియన్ల ఎకానమీ అంటూ మోదీ మాట్లాడుతున్నారు. కానీ 3.1 ట్రిలియన్ల దగ్గరే ఉన్నాం. ప్రధాని నిర్వాకం వల్ల దేశంలో నిరర్ధక ఆస్తులు రూ.4 లక్షల కోట్ల నుంచి రూ.18.60 లక్షల కోట్లకు చేరాయి. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ.. ఇప్పటికీ 15 పైసలు కూడా వేయలేదు. ద్రవ్యోల్బణం పెరిగింది... జీడీపీ పడిపోయింది. రూపాయి ఎందుకు పతనమవుతోందో ఆయన చెప్పాలి. నేపాల్‌, బంగ్లాదేశ్‌లలో కరెన్సీ విలువ పడిపోదు కానీ.. భారత్‌లో ఆ పరిస్థితి ఎందుకు? దేశంలో కరోనా నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైంది. లక్షల మంది ఉపాధి కోల్పోయి స్వగ్రామాలకు నడుచుకుంటూ వెళ్లారు. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల ప్రజలను కన్నబిడ్డల మాదిరిగా చూసుకున్నాం. ప్రతి ఒక్కరి జేబులో రూ.వెయ్యి పెట్టి.. 175 రైళ్లలో స్వగ్రామాలకు ఉచితంగా పంపాం.

అవి అహ్మదాబాద్‌ ఎన్నికలు అనుకున్నారా?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ తరఫున మోదీ ప్రచారం చేశారు. అయినా ట్రంప్‌ ఓడిపోయారు. ఏ ప్రధాని అయినా ఇలా చేస్తారా? అమెరికా ఎన్నికలను అహ్మదాబాద్‌ పురపాలక ఎన్నికలు అనుకున్నారా?

యశ్వంత్‌ అన్ని విధాలా అర్హుడు

ఓటు వేసేటప్పుడు రాష్ట్రపతి అభ్యర్థులను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు మనస్సాక్షిని అనుసరించి ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలి. గతంలో వీవీ గిరి అలాగే గెలిచారు. ఉన్నతమైన వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది. యశ్వంత్‌ ఉన్నత వ్యక్తిత్వంగలవారు. రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారు. అన్ని రంగాల్లో విశేష అనుభవం ఉన్న ఆయన రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హుడు’’ అని కేసీఆర్‌ తెలిపారు.


వ్యాపారులైన ఆయన దోస్తులకే తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచన మోదీకి లేదు. దేశంలో సరిపడా బొగ్గు నిల్వలున్నా.. విదేశాల నుంచి కొనాలని రాష్ట్రాలకు కేంద్రం హుకుం జారీ చేస్తోంది. అది ఏ వ్యాపారి కోసమో అందరికీ తెలుసు. మీరు ఎంత అవినీతి చేశారో, మీ స్నేహితులైన వ్యాపారులకు ఎంత దోచిపెట్టారో మా దగ్గర లెక్కలున్నాయి. చిట్టాను త్వరలోనే బయటపెడతాం.

- కేసీఆర్‌


‘‘మోదీతో వ్యక్తిగత విభేదాలు లేవు. ఆయన విధానాలపైనే మాకు అభ్యంతరం. ప్రధానిలో ప్రవహించే రక్తంలో కొంతైనా నిజాయతీ ఉంటే.. మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి’’


‘‘భారత ప్రధాని ఒత్తిడి కారణంగానే విద్యుత్‌ కాంట్రాక్టును ఆ దేశ వ్యాపారవేత్తకు కట్టబెట్టినట్లు శ్రీలంక విద్యుత్‌ బోర్డు ఛైర్మన్‌ పార్లమెంటరీ కమిటీ ముందు వెల్లడించారు. ఈ విషయంలో స్పందించకుంటే ప్రధానిని దోషిగా చూడాల్సి వస్తుంది. ఆయన దేశప్రజలకు క్షమాపణలు చెప్పేవరకూ మేం పోరాటం చేస్తూనే ఉంటాం’’


‘‘మోదీపై దేశప్రజల్లో ఆగ్రహం పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు భాజపాను ఓడించి ఇంటికి పంపిస్తారు’’


‘‘తెలంగాణ కోసం ప్రజలు 60 ఏళ్లు పోరాటం చేశారు. దేశం కోసం మరో పోరాటానికి వెనకాడరు. నవ భారత నిర్మాణానికి మరోసారి ఉద్యమిస్తాం’’


 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని