సంక్షిప్త వార్తలు

ఇటీవల హత్యకు గురైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌, పంజాబ్‌కు చెందిన గాయకుడు సిద్ధూ మూసేవాలాలకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం

Updated : 03 Jul 2022 07:01 IST

దర్జీ కన్హయ్యలాల్‌ మృతికి సంతాపం

దిల్లీ: ఇటీవల హత్యకు గురైన రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌, పంజాబ్‌కు చెందిన గాయకుడు సిద్ధూ మూసేవాలాలకు భాజపా జాతీయ కార్యవర్గ సమావేశం సంతాపాన్ని ప్రకటించింది. మణిపూర్‌లో ఇటీవల అసువులు బాసిన సైనికులకు నివాళి అర్పించింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపింది. సంతాప సందేశాలను హైదరాబాద్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి దిలీప్‌ సైకియా చదివారు.


‘మన ఊరు- మన బడి’ టెండర్లు రద్దు చేయాలి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ‘మన ఊరు- మన బడి’ టెండర్‌ ప్రక్రియను వెంటనే రద్దు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఇందులో జరిగిన అవకతవకలపై సింగిల్‌ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. ‘‘పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు తొలుత రూ.700 కోట్లతో టెండర్‌ పిలిచి అదే రోజు రద్దు చేశారు. రూ.1539 కోట్లతో మళ్లీ టెండర్లు పిలిచారు. దీనివెనుక ఆంతర్యం ఏమిటి? ‘డ్యూయల్‌ డెస్కు’ ధర రూ.4,500 కాగా టెండర్‌ ప్రకటనలో రూ.12 వేలుగా.. గ్రీన్‌బోర్డు ధర చదరపు అడుగుకు రూ.280 కాగా రూ.370గా పేర్కొన్నారు. ఇందువల్ల రూ.40 కోట్ల అదనపు ఖర్చవుతుంది. ఈ టెండర్లను రద్దు చేయాలి. బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు, విద్యాశాఖ మంత్రులను బర్తరఫ్‌ చేయాలి’’ అని ప్రవీణ్‌కుమార్‌ తన లేఖలో పేర్కొన్నారు.


ఏఐసీసీ ఓబీసీ విభాగం సమన్వయకర్తగా కేతూరి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ(ఏఐసీసీ) ఓబీసీ విభాగం జాతీయ సమన్వయకర్తగా ఓయూ విద్యార్థి నాయకుడు, పీసీసీ కార్యదర్శి డా.కేతూరి వెంకటేశ్‌ నియమితులయ్యారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆదేశాల మేరకు జాతీయ ప్రధాన కార్యదర్శి(ఆర్గనైజేషన్‌) కేసీ వేణుగోపాల్‌ ఆయన నియామకాన్ని శనివారం ప్రకటించారు. ఓబీసీ విభాగానికి జాతీయస్థాయిలో 17 మంది సమన్వయకర్తలను నియమించగా, అందులో తెలంగాణ నుంచి వెంకటేశ్‌కు అవకాశం లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు