బస్సు ఛార్జీల పెంపుపై వామపక్షాల నిరసన

ఆర్టీసీ బస్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతలు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ అవుట్‌ గేట్‌వద్ద శనివారం బస్సులను నిలిపేసి ధర్నా నిర్వహించారు.

Published : 03 Jul 2022 05:35 IST

విజయవాడ బస్‌స్టేషన్‌, న్యూస్‌టుడే: ఆర్టీసీ బస్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ వామపక్ష నేతలు విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్‌స్టేషన్‌ అవుట్‌ గేట్‌వద్ద శనివారం బస్సులను నిలిపేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం సీనియర్‌ నేత మధు మాట్లాడుతూ.. సామాన్యుడు బతికేందుకు వీలు లేకుండా వైకాపా ప్రభుత్వం అన్నింటి ధరలను పెంచుతూ రాష్ట్రాన్ని వల్లకాడు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రతిపక్ష పార్టీలు వైకాపా దిగాలి.. తాము రావాలి అంటున్నాయేతప్ప... ప్రజల తరఫున పోరాటాలు చేయడం లేదని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. పల్లె వెలుగు బస్సు ఛార్జీలను 62% పెంచిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని, విద్యుత్తు, బస్సు ఛార్జీలు, పన్ను భారాలు తగ్గించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని చెప్పారు. అవసరమైతే రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, న్యూ డెమోక్రసీ, వామపక్షాల నేతలు తదితరులు పాల్గొన్నారు. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని