ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌?

ఉపరాష్ట్రపతి పదవి రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Published : 03 Jul 2022 05:58 IST

చండీగఢ్‌: ఉపరాష్ట్రపతి పదవి రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన తన పార్టీని భాజపాలో విలీనం చేయబోతున్నట్లు కమలనాథులు చెబుతున్నారు. వెన్నెముక శస్త్రచికిత్స కోసం అమరీందర్‌ లండన్‌ వెళ్లారు. ఆపరేషన్‌ అనంతరం అక్కడే కోలుకుంటున్నారు. స్వదేశానికి తిరిగి రాగానే పార్టీ విలీనంపై ప్రకటన వెలువడుతుందని పంజాబ్‌ భాజపా సీనియర్‌ నేత హర్జిత్‌ సింగ్‌ గ్రేవాల్‌ శనివారం పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం జరిగిందని తెలిపారు. తన పార్టీని విలీనం చేయాలన్న ఉద్దేశాన్ని లండన్‌ వెళ్లడానికి ముందే అమరీందర్‌ వ్యక్తం చేశారని వివరించారు. 

అప్పటి పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌తో విభేదాల కారణంగా సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ గత ఏడాది తప్పించింది. దీంతో ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ (పీఎల్‌సీ) పేరిట ఆయన సొంత పార్టీని పెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాతో కలిసి పోటీ చేయగా.. ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. పాటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్‌ కూడా ఓటమిపాలయ్యారు. గత ఆదివారం శస్త్రచికిత్స అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ.. కెప్టెన్‌తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని