మహా అసెంబ్లీలో ఉత్కంఠ

భాజపా, శివసేన అభ్యర్థులు పోటీలో నిలవడంతో మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పదవికి ఓటింగ్‌ అనివార్యమైంది. మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) తరఫున శివసేన అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజన్‌ సాల్వి రంగంలోకి దిగŸడంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తొలి రోజు (ఆదివారం)...

Updated : 03 Jul 2022 06:57 IST

నేటి నుంచి రెండు రోజుల పాటు ప్రత్యేక సమావేశాలు
స్పీకర్‌ పదవికి ఎంవీఏ తరఫున బరిలోకి శివసేన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వి
భాజపా అభ్యర్థిగా రాహుల్‌ నర్వేకర్‌..

ముంబయి: భాజపా, శివసేన అభ్యర్థులు పోటీలో నిలవడంతో మహారాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పదవికి ఓటింగ్‌ అనివార్యమైంది. మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) తరఫున శివసేన అభ్యర్థిగా ఎమ్మెల్యే రాజన్‌ సాల్వి రంగంలోకి దిగడంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల తొలి రోజు (ఆదివారం) నిర్వహించే సభాపతి ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే భాజపా ఎమ్మెల్యే రాహుల్‌ నర్వేకర్‌ ఈ పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం కమలదళంతో చేతులు కలిపిన నేపథ్యంలో సభాపతిగా రాహుల్‌ సునాయాసంగా విజయం సాధించగలరు. అయితే, ఓటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే చివరి క్షణం వరకూ అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం లేకపోలేదు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు 39 మంది శనివారం సాయంత్రం గోవా నుంచి ముంబయికి చేరుకున్నారు. వీరి వెంట మరో 11 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ముంబయిలోని ఓ హోటల్లో బస చేసిన వీరందరూ అక్కడి నుంచే ఆదివారం ఉదయం అసెంబ్లీకి వెళ్తారు. కొత్త సీఎం శిందేకు.. స్పీకర్‌ ఎన్నిక తొలి పరీక్ష కానుంది. ఇప్పటి వరకూ ఆయన శిబిరంలో ఉన్న రెబెల్‌ ఎమ్మెల్యేలు అందరూ వెంట నిలుస్తారా లేదా అన్నది ఆదివారం ఓటింగ్‌ సమయంలో తేలనుంది. ఆ మరుసటి రోజే (సోమవారం) శాసనసభ విశ్వాసాన్ని ఆయన పొందాల్సి ఉన్నందున ఇది అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్‌, ఎన్సీపీ, శివసేనల కూటమి.. ఎంవీఏ తరఫున స్పీకర్‌ పదవికి పోటీ చేస్తున్న రాజన్‌ సాల్వి.. రత్నగిరి జిల్లా రాజాపుర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే. భాజపా అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్‌ వేసిన రాహుల్‌ నర్వేకర్‌ ముంబయిలోని కొలబా సెగ్మెంట్‌ ఎమ్మెల్యే. శాసనసభ సభాపతిగా ఉన్న నానా పటోలే గత ఏడాది ఫిబ్రవరిలో ఆ పదవికి రాజీనామా చేసి మహారాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి సభాపతి పోస్టు ఖాళీగా ఉంది. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య రాష్ట్ర సీఎంగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన ఏక్‌నాథ్‌ శిందే బల నిరూపణ కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు 3, 4 తేదీల్లో జరుగుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుత డిప్యూటీ స్పీకర్‌ నరహరి జిర్వాల్‌పై కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇచ్చిన అవిశ్వాస ప్రతిపాదన పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆయనే తాత్కాలిక స్పీకర్‌గా వ్యవహరిస్తారని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వ్యాఖ్యానించారు.


‘శిందేపై చర్యను సవాల్‌ చేస్తాం’

తిరుగుబాటు వర్గ నేత ఏక్‌నాథ్‌ శిందేను పార్టీ నుంచి, పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ శివసేన అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తీసుకున్న నిర్ణయాన్ని తగిన వేదికపై సవాల్‌ చేస్తామని రెబెల్‌ ఎమ్మెల్యేల అధికార ప్రతినిధి దీపక్‌ కెసర్కార్‌ తెలిపారు. పార్టీ శాసనసభ్యుల్లో అత్యధిక మంది ఏక్‌నాథ్‌ను తమ నేతగా ఎన్నుకున్నందున ఠాక్రే చర్య చెల్లుబాటు కాదని పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందునే శిందేపై చర్య తీసుకున్నట్లు జూన్‌ 30వ తేదీతో రాసిన లేఖలో ఠాక్రే పేర్కొన్నారు. అదే రోజు ఏక్‌నాథ్‌ శిందే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని