యశ్వంత్‌కు ఘనస్వాగతం

తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి వచ్చిన విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనను తెరాస అధినేత, సీఎం...

Published : 03 Jul 2022 05:58 IST

విమానాశ్రయానికి తరలివెళ్లిన సీఎం కేసీఆర్‌, మంత్రులు
అక్కడి నుంచి భారీ ర్యాలీ.. జలవిహార్‌లో సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్రపతి ఎన్నికల ప్రచారానికి వచ్చిన విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనను తెరాస అధినేత, సీఎం కేసీఆర్‌ ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు. కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌, పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావుతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు. యశ్వంత్‌ రాక సందర్భంగా బేగంపేట విమానాశ్రయం గులాబీమయమైంది. ఎంపీలతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల తెరాస అధ్యక్షులు గోపీనాథ్‌, మంచిరెడ్డి, శంబీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెరాస శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. అనంతరం బేగంపేట నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. మూడు జిల్లాల కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో పాల్గొన్నారు. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి పార్టీ సీనియర్‌ నాయకుడు నందకిశోర్‌వ్యాస్‌ బిలాల్‌ ఆధ్వర్యంలో సుమారు వెయ్యి మంది పాల్గొన్నారు. దాదాపు 2గంటల పాటు ర్యాలీ నిర్వహించి జలవిహార్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులు పట్టారు. బతుకమ్మ, బోనాలతో స్వాగతించారు. జలవిహార్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన సిన్హాకు మద్దతుగా సమావేశం నిర్వహించారు. సిన్హా, కేసీఆర్‌లతో పాటు నామా, మాజీ ఎంపీ సుధీంద్ర కులకర్ణి వేదికపై ఆసీనులయ్యారు. తెరాస ప్రస్థానం, రాష్ట్ర అభివృద్ధి గురించి సీనియర్‌ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. వివరించారు. అనంతరం సీఎం గంట సేపు, సిన్హా అరగంట పాటు ప్రసంగించారు. యశ్వంత్‌ సిన్హాను సీఎం పోచంపల్లి శాలువాతో సత్కరించారు. రజత వీణను బహూకరించారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్‌, సిన్హా కలిసి భోజనం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని