సవాళ్లున్నా.. సంక్షేమంలో మిన్న

అనేక సవాళ్లను ఎదుర్కొని కూడా ఆర్థికాభివృద్ధి సాధించామని, ఆయుష్మాన్‌ భారత్‌ కింద 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించామని, విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయని భాజపా ఆర్థిక తీర్మానం పేర్కొంది.

Published : 03 Jul 2022 05:58 IST

50 కోట్ల మందికి ‘ఆయుష్మాన్‌ భారత్‌’ సాంత్వన
ఈనాడు - హైదరాబాద్‌

అనేక సవాళ్లను ఎదుర్కొని కూడా ఆర్థికాభివృద్ధి సాధించామని, ఆయుష్మాన్‌ భారత్‌ కింద 50 కోట్ల మందికి ప్రయోజనం కలిగించామని, విదేశీ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయని భాజపా ఆర్థిక తీర్మానం పేర్కొంది. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో భాగంగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఈ తీర్మానం ప్రవేశపెట్టగా..వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌గోయల్‌, హరియాణా సీఎం ఎం.ఎల్‌.ఖట్టర్‌ బలపరిచారు. ఈ తీర్మానానికి సంబంధించిన వివరాలను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ విలేకరులకు వెల్లడించారు.

ఏడాదిన్నరలో 10 లక్షల ఉద్యోగాల భర్తీ

‘‘వచ్చే ఏడాదిన్నరలో దేశంలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. కేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ పథకాన్ని, ఉద్యోగాల కల్పన నిర్ణయాన్ని కార్యవర్గ బృందం అభినందించింది. గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద 80 కోట్ల మందికి 25 నెలల పాటు ఉచిత రేషన్‌ అందించాం. ఇందుకు రూ.2.6 లక్షల కోట్లు ఖర్చుచేశాం. కరోనా కాలంలో జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజలకు ఆర్థికసహాయం కింద రూ.30,944 కోట్లు జమ చేశాం. ఎనిమిదేళ్లలో విదేశీపెట్టుబడులు, జీఎస్‌టీ వసూళ్లు పెరిగాయి. ఏడాదిన్నరలో దేశీయంగా తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌ను 191 కోట్ల డోసులు అందించాం. ఇది ప్రజల సంకల్పానికి ప్రతిఫలం. ప్రధాని నేతృత్వం, దూరదృష్టి, నిర్ణయశక్తికి నిదర్శనం. దేశ టీకా అంతర్జాతీయ మోడల్‌గా మారింది అని పేర్కొంటూ తీర్మానాన్ని ఆమోదించాం.

పేదల కేంద్రంగా సంక్షేమ పథకాలు

రెండోసారి అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తరువాత కరోనా మహమ్మారిని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఎనిమిదేళ్లలో పేదల సంక్షేమం కోసం ఎక్కువగా కృషిచేశాం. ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన, ఉజ్వల యోజన, సౌభాగ్య పేరిట విద్యుత్తు కనెక్షన్లు, ఇంటింటికీ నల్లా నీళ్లు అందించాం. ఓవైపు మహమ్మారి తరువాత ప్రపంచ దేశాల ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయులను తాకింది. అయినా ప్రధాని మోదీ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి కరోనాతో అల్లాడుతుంటే.. 2022లో దేశం 8.7శాతం వృద్ధిరేటుతో ముందుకెళ్తోంది. ఆరో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఆత్మనిర్భర్‌ పెట్టుబడులతో ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కరోనా సమయంలో ఈ దేశాన్ని ఏం చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఆకలి చావులు ఉంటాయి.. ఆందోళనలు జరుగుతాయని కొందరు నోబెల్‌ గ్రహీతలు గగ్గోలు పెట్టారు. ఏం జరిగిందో ఇప్పుడు చూడండి. భారత వృద్ధిరేటు పెరిగింది. ప్రపంచ దేశాలన్నీ భారత్‌ను గ్లోబల్‌ హాట్‌స్పాట్‌గా భావిస్తున్నాయి. ఏదో కావాలని విపక్షాలు విషప్రచారం చేస్తే ప్రజలే నిర్ణయిస్తారు.. డ్రోన్‌పాలసీతో వ్యవసాయానికి అగ్రస్థానం కల్పిస్తాం. కష్టమైన ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా వస్తుసామగ్రిని సరఫరా చేస్తాం. ఈ రంగంలో భారీగా ఉద్యోగాలు వస్తాయి. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవరి జాగీరు కాదు. కొందరు ఏవో భ్రమల్లో ఉన్నారు. కానీ భాజపా సర్కారు అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తోంది. సబ్‌కా సాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా విశ్వాస్‌, సబ్‌కా ప్రయాస్‌.. ఇది భాజపా పరిపాలన పద్ధతి’’ అని తెలిపారు.

ఆర్థిక తీర్మానంలోని అంశాలివీ
*
కరోనా కాలంలో 14 కోట్ల మందికి ఉచిత ఎల్‌పీజీ సిలిండర్లు అందించాం
* ప్రజలు 48.6 బిలియన్‌ డిజిటల్‌ లావాదేవీలు నిర్వహించారు. ఇవి యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ దేశాలను కలిపి నిర్వహించిన లావాదేవీలకు మూడు రెట్లు
* పీఎం స్వానిధి పథకం కింద 31.9 లక్షల మంది వీధివ్యాపారులు లబ్ధిపొందారు
* ఎస్సీ, ఎస్టీ, మహిళలకు స్టాండప్‌ పథకం కింద నిధులు, పారిశ్రామికవేత్తలకు ముద్రా రుణాలు అందించాం
* ఐరన్‌ స్టీల్‌ ఎగుమతులు 7.64 బిలియన్‌ టన్నుల నుంచి 19.2 బిలియన్‌ టన్నులకు చేరాయి.
* మొబైల్‌ ఫోన్ల ఎగుమతులు రూ.1,300 కోట్ల నుంచి రూ.43వేల కోట్లకు పెరిగాయి
* విదేశీ పెట్టుబడులు 83.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని