Telangana Congress: కాంగ్రెస్‌లో భగ్గుమన్న విభేదాలు

తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదం రాజుకుంది. ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో అధిష్ఠానం ఆదేశాలతో నాయకులకు సఖ్యత కుదిరిందనుకున్న తరుణంలో కొత్త చిచ్చు రేగింది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా శనివారం హైదరాబాద్‌ వచ్చారు.

Updated : 03 Jul 2022 09:47 IST

వీహెచ్‌ కేంద్రంగా రాజుకున్న వివాదం
ఆయన యశ్వంత్‌సిన్హాను కలవడంపై రేవంత్‌ అభ్యంతరం
పార్టీ నిర్ణయాన్ని నేతలెవరైనా వ్యతిరేకిస్తే గోడకేసి కొడతామని వ్యాఖ్య
ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ జగ్గారెడ్డి

గాంధీభవన్‌, నాంపల్లి- న్యూస్‌టుడే: తెలంగాణ కాంగ్రెస్‌లో మరో వివాదం రాజుకుంది. ఇటీవల దిల్లీలో జరిగిన సమావేశంలో అధిష్ఠానం ఆదేశాలతో నాయకులకు సఖ్యత కుదిరిందనుకున్న తరుణంలో కొత్త చిచ్చు రేగింది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌సిన్హా శనివారం హైదరాబాద్‌ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్‌, మంత్రులు ఘనస్వాగతం పలికారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూడా విమానాశ్రయానికి వెళ్లి సిన్హాను కలిశారు. ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది. సిన్హాను కలిసే విషయమై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ముందే స్పష్టత ఇచ్చారు. ‘యశ్వంత్‌సిన్హా తెరాస నేతలను కలుస్తున్నందున మేం కలవకూడదని నిర్ణయించాం. కాంగ్రెస్‌ నేతలను సిన్హా కలవడానికి విడిగా ఏర్పాటు చేస్తాం’ అని చెప్పారు. ఈ నేపథ్యంలో వీహెచ్‌ తీరుపై రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి మండిపడ్డారు.

అసలేం జరిగిందంటే...

పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించగా.. ఆయనను కలవడానికి వచ్చిన సందర్భంగా రేవంత్‌ విలేకరులతో మాట్లాడారు. సిన్హాను వీహెచ్‌ కలిసిన విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా ఆయన స్పందించారు. ‘ఆ ఇంటిమీద వాలిన కాకి.. ఈ ఇంటిమీద వాలితే ఊరుకోం.. కాలుస్తాం.. సీఎం కేసీఆర్‌ను కలిసిన వ్యక్తి బ్రహ్మదేవుడైనా మేం కలిసేది లేదు.. అందుకే యశ్వంత్‌సిన్హాను మేం కలవలేదు’ అని స్పష్టం చేశారు. జాతీయ నాయకత్వంతో మాట్లాడే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దీన్ని పార్టీ నేతలెవరైనా అతిక్రమిస్తే చూస్తూ ఊరుకోం.. తీసి గోడకేసి కొడతాం’ అని వ్యాఖ్యానించారు. పార్టీలో క్రమశిక్షణను కాపాండేందుకే పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అలా మాట్లాడారని పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


పార్టీ రేవంత్‌రెడ్డి అయ్య జాగీరా?

ఆయనెవరు సిన్హాను కలవొద్దనడానికి?: జగ్గారెడ్డి

‘పార్టీ రేవంత్‌ అయ్య జాగీరు కాదు, ఆయనెవరు సిన్హాను కలవొద్దనడానికి? దీనిపై అగ్రనేతలకు ఫిర్యాదు చేస్తా’ అని జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియాహాలులో జగ్గారెడ్డి శనివారం విలేకరులతో మాట్లాడారు. ‘సీనియర్‌ నాయకుడైన హనుమంతరావును గోడకేసి కొడతానంటావా? ఆయన సిన్హాను కలవడంలో తప్పులేదు. సిన్హాను పక్కన కూర్చోబెట్టుకుని రాహుల్‌గాంధీ నామినేషన్‌ వేయించారు. మేం నీకు నౌకర్లమా? బంట్రోతులమా?’ అంటూ మండిపడ్డారు. రేవంత్‌ చిల్లర రాజకీయం చేస్తున్నాడు. సీఎల్పీకి చెప్పకుండానే జిల్లా నేతలకు కండువా కప్పుతున్నాడు. పార్టీ వ్యవహారాలు బయటపెట్టనని రాహుల్‌గాంధీకి ఇచ్చిన మాట తప్పినందుకు ఆయనకు క్షమాపణలు చెబుతున్నా’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని