Updated : 04 Jul 2022 06:50 IST

Narendra Modi: డబుల్‌ ఇంజిన్‌ వస్తోంది

తెలంగాణ ప్రజలు అందుకు బాటలు వేస్తున్నారు

 రాష్ట్ర అభివృద్ధే మా కర్తవ్యం

మెగా జౌళిపార్కు ఏర్పాటు చేస్తాం

సైన్స్‌ సిటీని తీసుకొస్తాం

విజయ సంకల్ప సభలో మోదీ

తెలంగాణ అభివృద్ధికి భాజపా తొలి ప్రాధాన్యమిస్తోంది. ఆత్మనిర్భర్‌ భారత్‌ కోసం పనిచేస్తోంది. బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తోంది. అందరితో కలిసి అందరి అభివృద్ధి (సబ్‌కా సాథ్‌, సబ్‌కా వికాస్‌) కోసం పనిచేస్తున్నాం. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికీ మంచి చేసేందుకు యత్నించాం.

- ప్రధాని మోదీ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలో డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌కు ప్రజలు బాటలు వేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో డబుల్‌ ఇంజిన్‌ సర్కారుతో అభివృద్ధి ఎన్నోరెట్లు పెరిగిందన్నారు. మున్ముందు తెలంగాణ అదే మార్గంలో నడుస్తుందన్నారు. రాష్ట్రం నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే భారతీయ జనతాపార్టీ లక్ష్యమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభ్యున్నతి కోసం తాము నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ఎనిమిదేళ్లుగా ప్రజల జీవనప్రమాణాలు పెంచేందుకు ప్రయత్నించామని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ కేంద్ర పథకాలు అందించేలా కృషి చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజలకు ఎంతో చేశామన్నారు. ఉచిత టీకాలు, రేషన్‌ అందించామని మోదీ గుర్తు చేశారు. రాష్ట్రంలో మెగా జౌళి పార్కును ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. దేశవ్యాప్తంగా ప్రారంభించనున్న ఏడుపార్కులలో ఒకటి ఇక్కడికే వస్తుందని, దీని ద్వారా రైతులకు మేలు జరుగుతుందని, యువతకు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. హైదరాబాద్‌లో సైన్స్‌సిటీ ఏర్పాటుకు ఎంతో ప్రయత్నిస్తున్నామన్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల ముగింపు సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో ఆదివారం సాయంత్రం ‘విజయ సంకల్ప’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగించారు. ముందుగా తెలుగులో మాట్లాడారు. ‘భాజపాను ఆశీర్వదించేందుకు ఎంతో దూరం నుంచి వచ్చిన సోదర, సోదరీమణులకు.. ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఈ సభకు వచ్చారనిపిస్తోంది. మీరు నాపట్ల చూపిన ప్రేమకు, అభిమానానికి ధన్యవాదాలు’ అని అన్నారు. తర్వాత ప్రసంగం ఇలా సాగింది.

‘‘కరోనా సమయంలో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని కాపాడేలా తెలంగాణలో వ్యాక్సిన్‌ పరిశోధనలు జరిగాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఆధునిక సైన్స్‌సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇప్పటికే జాతీయ పశువుల జీవవైద్య పరిశోధనల కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ప్రోత్సహించేందుకు మాతృభాషలో సాంకేతిక, వైద్య విద్యను బోధించేలా నిర్ణయం తీసుకున్నాం. దీంతో పేద కుటుంబాల కలలు నిజమవుతాయి.

మహిళల వృద్ధికి చేయూత

భాజపా ప్రభుత్వం మహిళలు, యువతులు, బాలికల ఆరోగ్యం, జీవన అభివృద్ధి పథకాలు అమలు చేసింది. స్వచ్ఛభారత్‌ కార్యక్రమంతో తెలంగాణలో లక్షలాది మంది మహిళలకు గౌరవనీయ జీవనం లభించింది. ఉజ్వల పథకంతో కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగింది. పోషణ్‌ అభియాన్‌, టీకాలతో ఆరోగ్యం మెరుగుపడింది. జీవన కష్టాలు తగ్గిపోయాయి. భారత్‌లో ప్రస్తుతం పురుషులతో పోల్చితే మహిళల సంఖ్య పెరుగుతోంది. 21వ శతాబ్దంలో మహిళాశక్తి.. దేశంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. వారు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నారు. బ్యాంకుల్లోని నగదు నిల్వల్లో మహిళల వాటా ఎక్కువ అని ఒక నివేదికలో వెల్లడైంది. సంపాదనలో వారి వాటా పెరిగింది. కుటుంబాల ఆర్థిక పరిస్థితి మారుతోంది. జన్‌ధన్‌ ద్వారా 45 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిపించాం. అందులో కోటికిపైగా జన్‌ధన్‌ ఖాతాలు తెలంగాణవి. వీటిలో 55 శాతం మహిళలవే.. ముద్ర, స్టాండ్‌ అప్‌ ఇండియా ద్వారా ఇచ్చిన అప్పుల్లోనూ మహిళలకే పెద్దపీట వేశాం. చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులకు కూడా ప్రత్యేక పథకాల ద్వారా చేయూతనిచ్చాం. రూ.35 వేల కోట్ల కంటే ఎక్కువ విలువ చేసే 5 జల ప్రాజెక్టులకు కేంద్రం సాయం అందిస్తోంది. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతుల నుంచి రూ.లక్ష కోట్ల ధాన్యాన్ని సేకరించింది. ఆ డబ్బులు కూడా చెల్లించాం. వరి ధాన్యానికి రూ.80 మద్దతు ధరను పెంచి, దాన్ని క్వింటాకు రూ.2 వేలకు చేర్చాం.

తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సబ్‌కాసాత్‌.. సబ్‌కా వికాస్‌.. సబ్‌కా ప్రయాస్‌ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తున్నాం. పేదలు, అసహాయులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మహిళలు అందరినీ అభివృద్ధిలో భాగం చేశాం. మా సంక్షేమ పథకాలు తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ అందుతున్నాయి. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి వచ్చినపుడు ఇక్కడి ప్రతి కుటుంబానికి సహాయం చేసేందుకు ప్రయత్నించాం. దేశంతో పాటు తెలంగాణలోని ప్రజలకు ఉచితంగా టీకాలు అందించాం. పేదలకు రేషన్‌, చికిత్స కల్పించాం.కేంద్రం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలతో భాజపాపై తెలంగాణ ప్రజల విశ్వాసం పెరుగుతోంది. ఇక్కడికి వచ్చిన ప్రజలను చూస్తుంటే పార్టీపట్ల ఉన్న ప్రేమ, ఉత్సాహం దేశంలోని అందరికీ తెలుస్తోంది. ప్రజల ప్రేమ పెరుగుతున్న కొద్దీ, రాష్ట్రంలో భాజపా మరింత ఉత్సాహంతో పనిచేస్తోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ అద్భుతమైన ఫలితాలు వచ్చాయి.

రామగుండం కర్మాగారం పునరుద్ధరించాం

కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూతబడిన కర్మాగారాలను పునరుద్ధరించాం.  2015లో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రూ.650 కోట్లతో పునరుద్ధరించాం. దీంతో ఎరువుల ఉత్పాదన పెరిగింది. రైతులకు మేలు జరుగుతోంది. విదేశాలపై ఆధారపడటం తగ్గుతోంది. త్వరలో ఈ కర్మాగారాన్నిజాతికి అంకితం చేస్తాం.

మౌలిక వసతులు కల్పిస్తున్నాం

అన్నిరంగాల్లో అభివృద్ధి కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు అవసరం. ఇందుకోసం హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా రూ.1500 కోట్లతో 4, 6 లేన్ల రోడ్లు, ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు నిర్మిస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసేలా 350 కి.మీ.రీజినల్‌ రింగురోడ్డు నిర్మిస్తున్నాం. ఎనిమిదేళ్ల కాలంలో జాతీయ రహదారుల పొడవు రెండు రెట్లు పెరిగి.. 2500 కి.మీ.నుంచి 5 వేల కి.మీకు చేరింది. గ్రామాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసేలా 2700 కి.మీ పొడవైన రోడ్లను నిర్మించాం. గ్రామీణ సడక్‌ యోజన మూడో దశ కింద రూ.1700 కోట్లతో 2500 కి.మీ పొడవైన రోడ్లు మంజూరు చేశాం. ఎనిమిదేళ్లలో తెలంగాణలో రూ.31 వేల కోట్ల ఖర్చుతో కొత్త రైల్వే లైన్లు నిర్మించాం’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.


‘‘హైదరాబాద్‌ నగరం దేశ ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసానికి చిహ్నం. ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రం. తెలంగాణలోని ఇతర నగరాలు, పట్టణాల్లోనూ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. దేశానికి, ప్రపంచానికి ఇచ్చేందుకు ఇక్కడ ఎంతో మేధోసంపత్తి ఉంది. హైదరాబాద్‌ ప్రతిభకు పట్టం కడుతుంది. భాజపా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది’’


‘‘తెలంగాణ పరాక్రమాల గడ్డ.  భద్రాచలంలో శ్రీరాముడు, యాదాద్రిలో లక్ష్మీ నరసింహస్వామి, జోగులాంబ అమ్మవారు, వరంగల్‌   భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదాలు ఈ ప్రాంతానికి ఉన్నాయి. కాకతీయుల వీరత్వం, శిల్పకళా సౌందర్యం ఎంతో గొప్పవి. ఇక్కడి సాహిత్యకారుల కృషి దేశానికే గర్వకారణం. కళలు, నైపుణ్యం ఇక్కడ మెండుగా ఉన్నాయి. ప్రాచీన సంస్కృతికి తెలంగాణ నిలయం. ఈ పవిత్ర భూమి ఎంతో స్ఫూర్తిని ఇస్తోంది’’


కేసీఆర్‌ గద్దె దిగడం ఖాయం!: నడ్డా

ప్రధాని ప్రసంగం వినడానికి భారీ జన సమూహం రావడం చూస్తుంటే  తెలంగాణలో కేసీఆర్‌ గద్దె దిగిపోవడం, భాజపా పాలన రావడం తథ్యం అనిపిస్తోంది. తెలంగాణ వాసులు చాలా తెలివైనవారు. కేసీఆర్‌ను ఇంటికి పంపాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు.


తెరాస ప్రభుత్వాన్ని పెకలించాలి: షా

తెరాస అవినీతి ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకలించాల్సిన సమయం వచ్చింది. 8ఏళ్లుగా పరిపాలన చేస్తున్న కేసీఆర్‌ కుమారుడికి సీఎం ఉద్యోగం ఎప్పుడిద్దామా అనే ఆలోచిస్తున్నారు తప్ప యువత ఉపాధిపై శ్రద్ధ పెట్టడం లేదు. వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం దక్కేది కేటీఆర్‌కు కాదు భాజపాకే.


జీహెచ్‌ఎంసీ ఫలితాలు ఆరంభమే: పీయూష్‌

దేశంలో భాజపా పాలిత రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నాయి. అలాంటి ప్రభుత్వం ఇక్కడా రావాలి. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో భాజపాకు వచ్చిన ఫలితాలు ప్రారంభం మాత్రమే. వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఇది వెల్లువలా ఉప్పొంగుతుంది.


భాజపా అంటే భయం: కిషన్‌రెడ్డి

తెరాస నేతలు ఒత్తిడిలో ఉన్నారు. భాజపాను చూసి భయపడుతున్నారు. భాజపాకు ఆశీర్వాదం ఇవ్వడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మోదీ గురించి కేసీఆర్‌ విషప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్‌లో తెరాస ఈవెంట్‌ మేనేజర్లు, పోలీసుల సాయంతో ఇంటింటికీ డబ్బులిచ్చినా భాజపా గెలిచింది.


రాష్ట్రం బరాబర్‌ భాజపాదే: బండి

భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా చెబుతున్నా. కేసీఆర్‌ గడీలో బందీ అయిన తెలంగాణ తల్లిని రక్షించుకునే బాధ్యతను ప్రతి ఒక్కరం తీసుకుందాం. మోదీ సైన్యం ఇప్పటికే ఆ యుద్ధానికి సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రం బరాబర్‌ భాజపాదే. ప్రజలారా డబుల్‌ ఇంజిన్‌ సర్కారుకు అవకాశం ఇవ్వండి.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని