Updated : 05 Jul 2022 07:21 IST

ఆహ్వానం పలికారు.. జాబితాలో పేరు లేదన్నారు

భీమవరం వెళ్లి ప్రధాని సభకు దూరంగా అచ్చెన్నాయుడు

ఈనాడు, అమరావతి- భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆహ్వానం మేరకు భీమవరం వెళ్లిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి అవమానం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోదీకి హెలిప్యాడ్‌ దగ్గర స్వాగతం పలికేవారి జాబితాలోగానీ, వేదికపైకి ఆహ్వానితుల్లోగానీ తన పేరు లేదని తెలియడంతో... అచ్చెన్నాయుడు ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. భీమవరంలో అల్లూరి విగ్రహానికి నివాళులర్పించి వెనుతిరిగారు. తెదేపా వర్గాల కథనం ప్రకారం... అల్లూరి జయంత్యుత్సవాలకు పార్టీ నుంచి ప్రతినిధిని పంపాలని తెదేపా అధినేత చంద్రబాబుకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసి ఆహ్వానించారు. అచ్చెన్నాయుడిని పార్టీ ప్రతినిధిగా పంపించాలని చంద్రబాబు నిర్ణయించారు. వేదికపైకి ఆహ్వానితుల జాబితాలో అచ్చెన్న పేరు ఉంటుందని కిషన్‌రెడ్డి కార్యాలయం ధ్రువీకరించింది. అచ్చెన్న ఆదివారం రాత్రి భీమవరం చేరుకున్నారు. ప్రధానికి ఆహ్వానం పలికేవారు, వేదికపై కూర్చునేవారి జాబితాల్లో అచ్చెన్న పేరు లేదన్న విషయం రాత్రి 10.30 గంటలకు తెదేపా నాయకులకు తెలిసింది. వారు కిషన్‌రెడ్డిని సంప్రదించారు. అచ్చెన్న పేరును చేర్చాలని కలెక్టర్‌కు చెబుతానని కిషన్‌రెడ్డి వెల్లడించారు. సోమవారం ఉదయానికీ అచ్చెన్న పేరు ఆ జాబితాల్లో లేకపోవడంతో తెదేపా నాయకులు మరోసారి కిషన్‌రెడ్డిని సంప్రదించారు. సభా ప్రాంగణానికి వచ్చేయాలని, అంతా తాను చూసుకుంటానని ఆయన బదులిచ్చారు. జాబితాలో పేరు లేకుండా రావడం బాగోదని, తాను రానని అచ్చెన్న చెప్పారు. భాజపా ప్రతినిధి ఒకరు అచ్చెన్న దగ్గరకు వచ్చి కిషన్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడించారు. తాను జిల్లా కలెక్టర్‌కు చెబుతానని, మీ పేరు జాబితాలో చేర్చినట్టు ఆమె ధ్రువీకరిస్తారని కిషన్‌రెడ్డి చెప్పారు. కాసేపటికి మళ్లీ కిషన్‌రెడ్డి కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసినా కలెక్టర్‌ అందుబాటులోకి రాలేదని వర్తమానం అందించారు. దాంతో ఇక ఆ కార్యక్రమానికి వెళ్లరాదని అచ్చెన్న నిర్ణయించుకున్నారు. పెదఅమిరం సభలో ప్రధాని ప్రసంగం మొదలయ్యాక... అచ్చెన్న నేరుగా భీమవరంలోని అల్లూరి విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. ప్రధాని ప్రసంగం పూర్తయ్యేదాకా వేచి చూసి, అల్లూరి విగ్రహానికి నివాళులర్పించారు.

ప్రొటోకాల్‌ను మంటగలిపారు...

ప్రధాని మోదీ పాల్గొన్న కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్‌ను మంటగలిపిందని తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. పార్టీ శ్రేణులతో కలిసి అల్లూరి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించి విలేకరులతో మాట్లాడారు. జాబితాల్లో పేరు లేకున్నా... తనకు బాధ లేదని అల్లూరి వంటి మహనీయుడి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించడం సంతోషకరమని తెలిపారు. స్థానిక పార్లమెంటు సభ్యుడికీ ఆహ్వానం లేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.


పొరపాటుకు చింతిస్తున్నాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సంబంధించి ప్రొటోకాల్‌ విషయంలో పొరపాటు జరిగిందని.. దానికి చింతిస్తున్నామని, ఆయన బాధపడి ఉంటే క్షమాపణ కోరుతున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పెదఅమిరంలో బహిరంగ సభ ముగిశాక భీమవరంలోని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. పలువురు ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించగా ట్రాఫిక్‌ ఇబ్బందుల కారణంగా హాజరు కాలేకపోయారన్నారు. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అంశాన్ని విలేకరులు ప్రస్తావించగా.. ప్రజల్లో మమేకమయ్యేందుకే ఈ వేడుకను నిర్వహించామని, రాజకీయాలను పరిష్కరించేందుకు కాదని సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ నిరసనల అంశంపై స్పందిస్తూ ఇక్కడ ఆ పార్టీ ఎక్కడ ఉందని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని