అధికారులు నా మాటను ఖాతరు చేయట్లేదు.. మంత్రిగా ఉండలేను: అమిత్‌షాకు రాజీనామా లేఖ

ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారులో కలకలం రేగింది! జల్‌శక్తిశాఖ సహాయమంత్రి దినేశ్‌ ఖటిక్‌ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేశారు. దళితుడినైనందున... తన ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడంలేదని ఆవేదన

Updated : 21 Jul 2022 07:18 IST

దళితుణ్ని కాబట్టే అవమానాలంటూ ఆవేదన

ఈనాడు, లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ సర్కారులో కలకలం రేగింది! జల్‌శక్తిశాఖ సహాయమంత్రి దినేశ్‌ ఖటిక్‌ ఉన్నట్టుండి తన పదవికి రాజీనామా చేశారు. దళితుడినైనందున... తన ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిపార్టుమెంటులో అవినీతి తాండవిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఈ విషయాలన్నీ పేర్కొంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఆయన మంగళవారం రాసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. అయితే, దీనిపై భాజపా కార్యాలయం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ప్రభుత్వం కూడా ఆయన రాజీనామాను ధ్రువీకరించలేదు.

‘ముఖ్య కార్యదర్శి ఫోన్‌కాల్‌ కట్‌ చేశారు..’

అమిత్‌షాకు రాసిన లేఖలో ఖటిక్‌ పలు కీలక అంశాలను ప్రస్తావించినట్టు చెబుతున్నారు. ‘‘దళితుడనైన నన్ను జల్‌శక్తిశాఖకు మంత్రిగా నియమించారు. కానీ, డిపార్టుమెంటులో అమలవుతున్న పథకాల గురించి అధికారులు నాకు సమాచారం ఇవ్వడంలేదు. నా ఉనికిని పట్టించుకోవడంలేదు. బదిలీల విషయంలో తీవ్రస్థాయి అవినీతి జరిగింది. ఇందుకు సంబంధించిన సమాచారం అడిగినా, అధికారులు ఇవ్వలేదు. పరిస్థితి వివరిద్దామని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ గార్గ్‌కు ఫోన్‌చేస్తే... నా మాట వినకుండానే ఫోన్‌ కట్‌ చేశారు. నా మాటకు విలువ లేనప్పుడు, అవమానం ఎదురవుతున్నప్పుడు... నేను మంత్రిగా కొనసాగడం వల్ల దళిత సమాజానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. బాధాతప్త హృదయంతోనే రాజీనామా చేస్తున్నా’’ అని ఖటిక్‌ తన లేఖలో పేర్కొన్నారు. మంగళవారం జరిగిన కేబినెట్‌ సమావేశానికి మంత్రి హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. యోగి ప్రభుత్వంలో తనకు ప్రాధాన్యం లేకపోవడం పట్ల మంత్రి కినుక వహించారు. లేఖ విషయమై విలేకరులు ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆయన కొట్టిపారేశారు.

ఆగ్రహంగా జితిన్‌ ప్రసాద?

రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి జితిన్‌ ప్రసాద కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. తనను విస్మరించి ముఖ్యమంత్రి నేరుగా తన శాఖలో పెద్దఎత్తున బదిలీలు చేపట్టడంపై కినుక వహించారు. ఈ అంశంపై అమిత్‌షాతో చర్చించేందుకు బుధవారం ఆయన దిల్లీ చేరుకున్నారు.

అధికారులు ప్రోటోకాల్‌ను పాటించాల్సిందే: డిప్యూటీ సీఎం

తాజా పరిణామం నేపథ్యంలో- ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య స్పందించారు. యూపీకి చెందిన ప్రతి అధికారి, ఉద్యోగి ప్రోటోకాల్‌ను పాటించాల్సిందేనని; మంత్రులు, ప్రజాప్రతినిధుల మాట వినాల్సిందేనని తేల్చిచెప్పారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. తమను విమర్శిస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తన పార్టీని కాపాడుకోవడంపై దృష్టి సారించాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని