Adhir Ranjan Chowdhury: పొరపాటైంది.. క్షమించండి

తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు రాజకీయంగా పెను దుమారం రేపి రెండు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన ‘రాష్ట్రపత్ని’ పద ప్రయోగం పట్ల కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి

Updated : 30 Jul 2022 09:49 IST

అనుచిత పద ప్రయోగానికి చింతిస్తున్నా
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధీర్‌ రంజన్‌ లేఖ
వివాదానికి ముగింపు పలికే యత్నం
‘రాష్ట్రపత్ని’పై పార్లమెంటులో రెండో రోజూ తీవ్ర దుమారం

ఈనాడు, దిల్లీ: తీవ్ర వివాదాస్పదం కావడంతో పాటు రాజకీయంగా పెను దుమారం రేపి రెండు రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలను కుదిపేసిన ‘రాష్ట్రపత్ని’ పద ప్రయోగం పట్ల కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి శుక్రవారం క్షమాపణ చెప్పారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ ద్వారా నేరుగా తెలియజేశారు. ఆమె పదవిని మరోలా సంభోదించడంపై తీవ్ర విచారం వ్యక్తంచేశారు. నోరుజారడం వల్లే తప్పిదం జరిగిందని వివరించారు. ‘‘మీ హోదాను తప్పుగా పేర్కొన్నందుకు పశ్చాత్తాపం చెందుతూ ఈ లేఖరాస్తున్నాను. నోరుజారడం వల్ల దొర్లిన పొరపాటిది. అందుకు క్షమాపణ చెబుతున్నాను. దీన్ని అంగీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని అధీర్‌ రంజన్‌ ఈ లేఖలో పేర్కొన్నారు. తన వ్యాఖ్యలపై భాజపా తీవ్ర అభ్యంతరం తెలిపిన నేపథ్యంలో అధీర్‌ గురువారం విలేకరులతో మాట్లాడుతూ...‘రాష్ట్రపతిని కలిసి క్షమాపణ చెబుతాన’ని వెల్లడించారు. అయితే, అందుకు రాష్ట్రపతి భవన్‌ నుంచి అనుమతి లభించిందో లేదో స్పష్టంకాలేదు.

సభాపతికీ అధీర్‌ రంజన్‌ లేఖ

రాష్ట్రపతి ముర్ము ప్రస్తావనను లోక్‌సభలో కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తీసుకొచ్చిన తీరుపై  తీవ్ర అభ్యంతరం తెలుపుతూ లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు అధీర్‌ శుక్రవారం లేఖ రాశారు. ‘జన్మతః బెంగాలీనైన నాకు హిందీలో అంతగా ప్రావీణ్యం లేదు. రాష్ట్రపత్ని అంటూ పొరపాటున సంబోధించా. ఇది నిజంగా విచారకరమే. అయితే, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ ఈ అంశాన్ని వివాదంలోకి లాగింది. ఈ గొడవతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాకు ఎలాంటి సంబంధంలేకున్నా ఆమె క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. సభ రికార్డుల నుంచి ఆ అంశాలను తొలగించండి. రాష్ట్రపతిని గౌరవ వచనంతో కాకుండా కేవలం ‘ద్రౌపదీ ముర్ము’ అని పదే పదే సంభోదిస్తూ స్మృతి చేసిన వ్యాఖ్యలనూ రికార్డుల నుంచి తొలగించాల’ని అధీర్‌ రంజన్‌ లేఖలో విజ్ఞప్తి చేశారు.

వివాదం ముగిసిపోతుందా?

అధీర్‌ రంజన్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణ చెప్పాల్సిందేనంటూ డిమాండ్‌ చేస్తూ పార్లమెంటులో, దేశవ్యాప్తంగా ఆందోళనచేపట్టిన భాజపా...ఈ లేఖతో శాంతిస్తుందా లేదా అన్నది వేచిచూడాల్సిందే. అయితే, రాష్ట్రపతికి అధీర్‌ క్షమాపణలు తెలపడంతో ఉద్రిక్తత సడలిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపున అధిక ధరల సమస్య అంశాన్ని సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే విషయమై ప్రతిపక్షాలు ఉభయ సభల కార్యకలాపాలను రెండు వారాలుగా అడ్డుకుంటున్నాయి.

వారి వ్యాఖ్యలను తొలగించండి: కాంగ్రెస్‌

రాజ్యసభలో గురువారం సోనియాగాంధీని విమర్శిస్తూ కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ఎగువసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రాజ్యసభ ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడికి లేఖ రాశారు. సభలో లేని, మరో సభకు చెందిన సభ్యుల పేర్లను ప్రస్తావించడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని, సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఖర్గే పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతంలో వెలువడిన రూలింగ్‌లనూ గుర్తు చేశారు. ఆ మంత్రులిద్దరూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

సోనియా సారీ చెబితేనే సభ నడుస్తుంది: భాజపా ఎంపీ

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై అధీర్‌ రంజన్‌ అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ క్షమాపణలు చెబితేనే లోక్‌సభ కార్యకలాపాలు సజావుగా సాగుతాయని భాజపా ఎంపీ నిశికాంత్‌ దుబే తెలిపారు. ‘గిరిజనులను అవమానించడాన్ని భాజపా సహించదు. సోనియా క్షమాపణ చెప్పిన తర్వాతే లోక్‌సభ నడుస్తుంది’ అని వరుసగా చేసిన ట్వీట్లలో నిశికాంత్‌ స్పష్టం చేశారు.


ముందుకు సాగని సభలు

రాష్ట్రపతికి శుక్రవారం అధీర్‌ రంజన్‌ లేఖ రాయడానికి ముందు కమలదళ ఎంపీలు పార్లమెంటు ఉభయ సభల్లో నిరసనకు దిగారు. సర్బానంద సోనోవాల్‌ తదితర కేంద్ర మంత్రులూ వారితో గొంతు కలిపారు. వీరికి పోటీగా కాంగ్రెస్‌ సభ్యులు కూడా....తమ అధ్యక్షురాలు సోనియా గాంధీని గురువారం లోక్‌సభలో చుట్టుముట్టడమే కాకుండా ఎగతాళి చేస్తూ మాట్లాడిన స్మృతీ ఇరానీని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉభయ సభల్లోనూ ఇదే వివాదం కొనసాగింది. దీంతో ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే లోక్‌సభ, రాజ్యసభ వాయిదా పడ్డాయి. పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్‌ ఎంపీలు నిర్వహించిన ధర్నాకు ఆరెస్పీ, ఐయూఎంఎల్‌ మద్దతు తెలిపాయి. సోనియా గాంధీని అవహేళన చేసిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్‌ చేశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని