Updated : 06 Aug 2022 08:13 IST

KTR: ఖాళీ గిన్నెలకే మోత ఎక్కువ

భాజపా నాయకుల ప్రచారం అలాంటిదే

మునుగోడు ఉపఎన్నికతో మారేదేమీ లేదు

మరికొన్ని స్థానాలకూ జరుగుతాయంటూ సంజయ్‌ పగటి కలలు

పేదలకు సాయం చేయని ప్రధాని కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేశారు

ట్విటర్‌లో నెటిజన్లతో ముఖాముఖిలో మంత్రి కేటీఆర్‌

ఈనాడు - హైదరాబాద్‌

వాక్‌ స్వేచ్ఛను సమర్థించే ప్రజాస్వామిక ప్రభుత్వం మాది. దురదృష్టవశాత్తు ఈ మధ్య కాలంలో ఈ వాక్‌ స్వేచ్ఛ ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది. దాన్ని ఎవరూ సహించవద్దు.

విద్యుత్‌రంగంలో ప్రైవేటీకరణ వల్ల ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ నిలిచిపోతుంది. దానిపై ఆధారపడిన రైతులు, ఇతర వర్గాల వారు తీవ్రంగా నష్టపోతారు. ఉచిత పథకాలపై సరైన దృక్పథంతో ప్రభుత్వాలు పనిచేయాలి.

ఆసరా పింఛన్ల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేసేలా నగదు బదిలీ చేసే అంశాన్ని పరిశీలిస్తాం.

- కేటీఆర్‌

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో వందశాతం తెరాసనే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తనకు ఏ పదవిపైనా ఆశ లేదని, కేసీఆర్‌ రూపంలో సమర్థుడైన సీఎం మనకున్నారని, తెలంగాణ ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్‌ కొడతారని అన్నారు. శుక్రవారం ట్విటర్‌ వేదికగా ఆయన నెటిజన్లతో కేటీఆర్‌ను అడగండి (ఆస్క్‌ కేటీఆర్‌) కార్యక్రమం నిర్వహించారు. పలు అంశాలపై నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ‘‘ఎన్నికల్లో మాకు ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. ప్రజలతోనే పొత్తు. మునుగోడులో జరిగేది మరో ఎన్నిక.  దాంతో మారేదేమీ ఉండదు. పేదలకు ఏ మాత్రం మేలు చేయని ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ.12 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. విపక్ష సర్కార్ల కూల్చివేతలపై గాకుండా రూపాయి పతనాన్ని నిరోధించే అంశంపై ఆయన దృష్టి సారించాలి’’ అని కేటీఆర్‌ అన్నారు. భాజపా నాయకులు ప్రచారం చేస్తుంటే తెరాస పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని ఒక నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. ఖాళీ గిన్నెలకే మోత ఎక్కువ. మరికొన్ని స్థానాలకూ ఉప ఎన్నికలు జరగనున్నాయనే బండి సంజయ్‌ వ్యాఖ్యలు కేవలం పగటి కలలు’’ అని అన్నారు. కొత్త సచివాలయం దసరాకు సిద్ధమవుతుందని చెప్పారు.

జీఎస్టీ మండలి సలహా మండలి మాత్రమే

‘‘జీఎస్టీ పాలకమండలి సలహా మండలి మాత్రమే. అధిక పన్నులు సిఫార్సు చేసినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం వాటిని అమలు చేయాల్సిన అవసరం లేకపోవడం. జీఎస్టీ మండలిలో మెజారిటీ ఉందని మోదీ ప్రభుత్వం ఎడాపెడా పన్నులు పెంచుతోంది. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ నిధులను మంజూరు చేయగా... వాటి విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తోంది. విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంతో పాటు హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. భూసేకరణ సమస్యల వల్ల హైదరాబాద్‌ ఔషధనగరి ప్రారంభంలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే వాటిని పరిష్కరిస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎంతో సహా ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు. భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ పథకం (బీఆర్‌ఎస్‌)పై స్టే ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నాం. మరో అయిదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తాం.

వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా-ఇ

వచ్చే ఫిబ్రవరిలో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ ఫార్ములా ఇ-రేస్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తుంది. ట్యాక్‌బండ్‌పై సండే ఫన్‌డేను త్వరలోనే పునఃప్రారంభిస్తాం. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీల పరిధిలో మరిన్ని సైక్లింగ్‌ లేన్‌లను ఏర్పాటు చేస్తాం. కండ్లకోట ఐటీ పార్కు నిర్మాణ పనులను త్వరలోనే ప్రారంభిస్తాం.  క్రాన్‌ఫీల్డ్‌ యూనివర్సిటీ భాగస్వామ్యంతో తెలంగాణలో వైమానిక విశ్వవిద్యాలయం కోసం సిలబస్‌ను సిద్ధం చేశాం. దేవరకద్రలో భారీ పరిశ్రమ ఏర్పాటుకు ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు’’ అని కేటీఆర్‌ చెప్పారు. ఏఎంవీఐ పరీక్షల కోసం లైసెన్స్‌ పొందేందుకు కటాఫ్‌ తేదీని మార్చాలని మరో నెటిజన్‌ చేసిన వినతిని ఆయన ఆ శాఖ మంత్రి పువ్వాడ దృష్టికి తీసుకెళ్లారు. ఖమ్మంలోని లకారం ట్యాంక్‌బండ్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం పెట్టడంపై మీ అభిప్రాయం ఏమిటని ఓ నెటిజన్‌ అడగ్గా... ‘‘ఎన్టీఆర్‌ మహానాయకుడు. ఆయనను గౌరవించడంలో తప్పేమీ లేదు’’ అని అన్నారు.

మరిన్ని అర్బన్‌ పార్కులు వస్తాయ్‌...

హైదరాబాద్‌ నగరంలో ఈబీఆర్‌టీఎస్‌ తెస్తామని, పురపాలక శాఖ ముఖ్యంగా హెచ్‌ఎండీఏ ఇప్పటికే 19 అర్బన్‌ పార్కులను ఏర్పాటు చేసిందని, మరిన్ని వస్తాయని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ‘‘ఉప్పల్‌ ఫ్లైఓవర్‌ పనులను వేగవంతం చేశాం. హైదరాబాద్‌లో మురుగు, వరదనీటి కాల్వలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నాం. సమీకృత నాలా అభివృద్ధి కార్యక్రమం కింద పనులు జరుగుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 180కి పైగా చెరువుల పరిరక్షణకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించాం. నగరంలో ట్రాఫిక్‌ సమస్యలకు మెట్రో పరిష్కారంగా ఉంది. మెట్రోను పాతనగరంతో పాటు విమానాశ్రయం వరకు విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. మూసీ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం’’ అని కేటీఆర్‌ తెలిపారు.

మరికొన్ని ఇలా...

బాసరలోని ట్రిపుల్‌ ఐటీని నిర్లక్ష్యం చేయడం లేదు. ఇప్పటికే ఉపకులపతి వెంకటరమణ, డైరెక్టర్‌ సతీష్‌లు స్థానికంగా ఉండి... సమస్యలను పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వపరంగా ఇంకా ఎమైనా ఉంటే విద్యాశాఖ మంత్రి వాటిని పరిష్కరిస్తారు.

అందరి ఇళ్లపై సౌర పలకల వినియోగం మంచి ఆలోచన. దీనిని విద్యుత్‌ మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. వరంగల్‌లోనూ ఆహారశుద్ధి ప్రత్యేక మండళ్లను ఏర్పాటుచేస్తాం. ఐటీని విస్తరిస్తాం.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో అతిథి అధ్యాపకులు తమ సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ మంత్రిని కలవాలి.

కురవి మండలం కాల్వతండాలో ధరణి సమస్యలను సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ పరిశీలిస్తారు.

ఇప్పటివరకూ నా రాజకీయ ప్రసంగాలను టీవీల్లో చూడకపోతే బిగ్‌ స్క్రీన్‌పై చూడొచ్చు.

ఆంధ్రాలో పోటీ చేయాలని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని