Politics news: ప్రైవేట్‌ ఫ్రాంఛైజీలా మారిన పీసీసీ: శ్రవణ్‌

కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఏడాదిగా పార్టీలో కొనసాగుతున్న ఆరాచక పరిస్థితులను జీర్ణించుకోలేక ఈ నిర్ణయం

Published : 06 Aug 2022 06:12 IST

కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ప్రకటించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఏడాదిగా పార్టీలో కొనసాగుతున్న ఆరాచక పరిస్థితులను జీర్ణించుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏ పార్టీలో చేరాలనేది ఇంకా నిర్ణయించుకోలేదని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రవణ్‌ మాట్లాడారు. ఏడాదిగా అవమానాలు భరించిన తాను ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు తెలిపారు. పీసీసీ ఒక మాఫియాలా మారిందని, పార్టీలో కులం, డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి పీసీసీని ఫ్రాంఛైజీ తీసుకున్న ప్రైవేటు పార్టీలా మార్చుకుని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. పార్టీలో పరిణామాలు, తప్పిదాలను నేతలు రాహుల్‌గాంధీ, కె.సి.వేణుగోపాల్‌, మాణికం ఠాగూర్‌లకు చెప్పినా పట్టించుకోలేదన్నారు. రేవంత్‌రెడ్డితో మాణికం ఠాగూర్‌, వ్యూహకర్త సునీల్‌లు కుమ్మక్కయ్యారని, ప్రశ్నించిన వారిపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. పార్టీలోని బీసీ, ఎస్సీ నేతలు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు.  

ఫలించని నిలువరించే యత్నాలు..

దాసోజు శ్రవణ్‌ రాజీనామా అంశం వెలుగులోకి రావడంతో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కోదండరెడ్డి, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌లు ఆయన ఇంటికి వెళ్లి నచ్చజెప్పేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.  దివంగత పి.జనార్దన్‌రెడ్డి కుమార్తె, తెరాస కార్పొరేటర్‌ విజయారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై దాసోజు శ్రవణ్‌ అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని