Updated : 06 Aug 2022 03:49 IST

Revanth: కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు: రేవంత్‌రెడ్డి

మునుగోడుపై కాంగ్రెస్‌ జెండా ఎగరేస్తామని స్పష్టీకరణ

ఈనాడు, నల్గొండ: మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని అమిత్‌షా వద్ద తాకట్టు పెట్టి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టులు తెచ్చుకున్నారని...అందుకే కాంగ్రెస్‌ను వీడి భాజపాలో చేరుతున్నారని  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. గెలిపించిన కార్యకర్తలను, టికెటిచ్చిన సోనియాగాంధీని ఆయన నిలువునా మోసం చేసి చరిత్ర హీనుడిగా మారారని మండిపడ్డారు. ఉపఎన్నిక ద్వారానే నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని భావిస్తే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తామే తిరిగి పార్టీ తరఫున టికెట్‌ ఇచ్చి గెలిపించేవారమన్నారు. మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం చండూరులో శుక్రవారం సాయంత్రం జరిగింది. కార్యక్రమానికి హాజరైన రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘మునుగోడులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం. తెలంగాణ ఇచ్చిన తల్లిలాంటి సోనియాను ఈడీ కేసులతో వేధిస్తే అమిత్‌షాను కలిసిన ద్రోహి రాజగోపాల్‌రెడ్డి. జైలుకు వెళ్లొచ్చిన వారి దగ్గర పనిచేయడం నచ్చకనే పార్టీ మారుతున్నా అని చెబుతున్నారు. నేను రాజకీయ కుట్ర వల్ల నెల రోజులు జైల్లో ఉంటే... హత్య కేసులో అమిత్‌షా 90 రోజులు జైల్లో ఉన్నారు. మరి ఆయన వద్దకు ఎందుకు పోయారు? కాంట్రాక్టుల కోసమే కదా?’’ అని ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టుల కోసం రూ.5 వేల కోట్లు కేంద్రం నుంచి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

ప్రత్యేక సందర్భంలో జరిగే ఈ మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలంతా కాంగ్రెస్‌కు అండగా ఉండాలని కోరారు.  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరైనా మరోసారి పార్టీ గెలుపు తథ్యమన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు, నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసి పార్టీ ఫిరాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర మంత్రి అమిత్‌షాను శుక్రవారం ఎందుకు కలిశారో స్పష్టం చేయాలన్నారు. తన పార్లమెంటు పరిధిలో కీలక సభ జరుగుతుంటే శత్రువులతో కలవడం ఏంటని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts