YSRCP: ఎమ్మెల్యే వేధిస్తున్నారంటూ వైకాపా నాయకుల ఆందోళన

జిల్లా మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అమర్‌నాథ్‌ను కలిశామనే కక్షతో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) తమను వేధిస్తున్నారని కొందరు వైకాపా

Updated : 07 Aug 2022 06:55 IST

కన్నబాబురాజు తీరుపై నిరసన

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: జిల్లా మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అమర్‌నాథ్‌ను కలిశామనే కక్షతో ఎమ్మెల్యే యూవీ రమణమూర్తిరాజు (కన్నబాబురాజు) తమను వేధిస్తున్నారని కొందరు వైకాపా నాయకులు నిరసనకు దిగారు. దొప్పెర్ల సర్పంచి కొరుపోలు చిన్నారావు, వైస్‌ ఎంపీపీ భర్త వాసుపల్లి శ్రీనివాసరావు, అచ్యుతాపురం ఎంపీటీసీ సభ్యురాలి భర్త ద్వారపురెడ్డి బాబ్జి, పూడిమడక ఎంపీటీసీ భర్త మేరుగు అప్పలనాయుడు ఆధ్వర్యంలో కొందరు కార్యకర్తలు శనివారం అచ్యుతాపురంలో నిరసన తెలిపారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు   ద్వారపురెడ్డి బాబ్జి దుకాణ సముదాయం ముందు నిర్మించిన షెడ్డు తొలగింపు పని చేపట్టారు. ఎమ్మెల్యేకు చెప్పకుండా తాము మంత్రులను కలిశామని కక్ష సాధించేందుకే ఆయన ఈ పని చేయిస్తున్నారని నిరసనకు దిగారు. ఎమ్మెల్యేపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. నిర్మాణాలు తొలగించవద్దని ఉప తహసీల్దార్‌కు వినతిపత్రం అందించారు. ఎమ్మెల్యే వేధింపులకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసినట్లు మేరుగు అప్పలనాయుడు విలేకర్లకు తెలిపారు. నిరసనలో ఆవసోమవరం ఎంపీటీసీ సభ్యుడు ఈతా బాబూరావు, దోసూరు సర్పంచి భర్త నర్మాల రామకృష్ణ, పోలార్పు పారునాయుడు, కోట్ని శివ, అడిగర్ల దేముడు, కొల్లి సత్యనారాయణ పాల్గొన్నారు.

తప్పు చేస్తే శిక్ష తప్పదు: ఎమ్మెల్యే
తప్పు చేస్తే సొంత పార్టీవారినైనా క్షమించేది లేదని ఎమ్మెల్యే కన్నబాబురాజు తెలిపారు. వైకాపా నాయకుల ఆందోళనపై ఆయన ‘న్యూస్‌టుడే’తో మాట్లాడారు. కొండకర్ల పోర్టు కాలనీలో పేద కార్మికుల ఇళ్లస్థలాలతో పాటు సొంత పార్టీకి చెందిన సామాన్యుల స్థలాలు కబ్జా చేశారన్నారు. అచ్యుతాపురంలో మరో కార్యకర్త రెవెన్యూ కార్యాలయానికి వెళ్లే రహదారిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నారు. దొప్పెర్లలో భారీస్థాయిలో దొంగ ఓట్లు చేర్చడంతో పాటు జగనన్న కాలనీలో ఇళ్లస్థలాలను బినామీల పేరుతో కాజేశారని మండిపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని