KTR: నేతన్నల కడుపు కొడుతున్న మోదీ

దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత, జౌళిరంగంపై మోదీ ప్రభుత్వం కక్ష గట్టిందని, ఈ రంగానికి సాయం చేయకపోగా జీఎస్టీ వంటి పన్నుల భారాలతో కార్మికుల కడుపుకొడుతోందని తెలంగాణ

Updated : 07 Aug 2022 06:32 IST

పైసా సాయం లేదు... పైగా పన్నుల భారం
మంత్రి కేటీ రామారావు
కేంద్ర చేనేత, జౌళిశాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో వ్యవసాయం తరువాత ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత, జౌళిరంగంపై మోదీ ప్రభుత్వం కక్ష గట్టిందని, ఈ రంగానికి సాయం చేయకపోగా జీఎస్టీ వంటి పన్నుల భారాలతో కార్మికుల కడుపుకొడుతోందని తెలంగాణ చేనేత, జౌళి శాఖల మంత్రి కేటీ రామారావు విమర్శించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనలో మోదీ ప్రకటించిన మెగాజౌళి పార్కు ఏమయిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. చేనేత కార్మికులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ఈ ఆగస్టు 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం నాటికి జీఎస్టీని రద్దు చేయాలన్నారు. లేనిపక్షంలో భాజపా నాయకులను నేతన్నలు నిలదీస్తారని కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ మేరకు కేంద్ర చేనేత, జౌళి శాఖల మంత్రి పీయూష్‌గోయల్‌కు శనివారం ఆయన లేఖ రాశారు.  

కాకతీయ మెగా జౌళి పార్కేది?

‘‘జౌళి రంగంలోని ప్రపంచ స్థాయి కంపెనీల పెట్టుబడులకు తెలంగాణను గమ్యస్థానంగా మార్చాలన్న లక్ష్యంతో వరంగల్‌లో సీఎం కేసీఆర్‌ కాకతీయ మెగా జౌళిపార్కును ప్రారంభించారు.రూ.1,552 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం దానికి వెచ్చించింది. కేంద్రం తరఫున కనీసం మౌలిక సదుపాయాలన్నా కల్పించాలని కోరితే ఇప్పటివరకు స్పందన లేదు. రాష్ట్రంలోనే అత్యధిక పవర్‌లూమ్‌ మగ్గాలున్న సిరిసిల్లలో వీవింగ్‌ పార్క్‌, అపెరల్‌పార్క్‌తో పాటు కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌లను ఏర్పాటు చేస్తున్నాం. సీపీసీడీ పథకం కింద మెగా క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కోరితే కేంద్రం పెడచెవిన పెట్టింది. యాదాద్రి, గద్వాల, నారాయణ్‌పేట, వరంగల్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌ వంటి జిల్లాల్లో అత్యంత నైపుణ్యం కల 40 వేల మంది చేనేత కార్మికులుండగా  ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, ఇక్కత్‌, గొల్లభామ వంటి చీరలకు రాష్ట్రం నెలవుగా ఉంది. నేతన్నలకు ఊతమిచ్చేందుకు, భవిష్యత్తు తరాలకు ఈ కళను అందించేందుకు జాతీయ చేనేత సాంకేతిక సంస్థ (ఐఐహెచ్‌టీ)ని ఏర్పాటు చేయాలని కోరినా కేంద్రం పెడచెవిన పెట్టింది.హైదరాబాద్‌లో జాతీయ జౌళి పరిశోధన సంస్థ, చేనేత ఎగుమతుల ప్రోత్సాహక మండలి ఏర్పాటుపైనా శీతకన్నేసింది.రాష్ట్రంలోని మరమగ్గాల నవీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 50% నిధులను భరించేందుకు సిద్ధంగా ఉన్నా, కేంద్రం మిగిలిన 50 శాతం ఇవ్వడానికి ముందుకు రావడం లేదు.  

రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడి నేతన్నల తరఫున తాను లేవనెత్తిన ఈ అంశాలన్నింటిపై తెరాస ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంటులో సైతం నిలదీస్తారు. ప్రధాని, కేంద్రమంత్రులకు సోయి ఉంటే వెంటనే  సానుకూలంగా స్పందించాలి’’ అని లేఖలో కేటీఆర్‌ కేంద్రమంత్రి పీయూష్‌ను కోరారు.


నేటి నుంచే నేతన్నకు బీమా

రాష్ట్రంలో నేతన్న బీమా పథకం ఆదివారం ప్రారంభం కాబోతోంది. జాతీయ చేనేత దినోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ పీపుల్స్‌ప్లాజాలో జరిగే కార్యక్రమంలో.. మంత్రి కేటీఆర్‌ దృశ్యమాధ్యమంలో ఈ పథకాన్ని ప్రారంభించి ప్రసంగిస్తారు. దేశంలో తొలిసారి.. రాష్ట్రంలోని 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికుల కుటుంబాల కోసం ఈ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. తెలంగాణలో జియోట్యాగింగ్‌ ఉన్న మగ్గాలపై పనిచేసే 18 నుంచి 59 ఏళ్ల వయసున్న చేనేత, మరమగ్గాల కార్మికులందరూ ఈ పథకానికి అర్హులు. నమోదైన వారిలో ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే పది రోజుల్లోపు నామినీకి రూ.5 లక్షల బీమా సాయం అందుతుంది. ఈ పథకం అమలుకు ఎల్‌ఐసీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వార్షిక ప్రీమియంను  ప్రభుత్వమే చెల్లిస్తుంది. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా జాతీయస్థాయి చేనేత ప్రదర్శనను సైతం మంత్రి కేటీఆర్‌ దృశ్యమాధ్యమంలో ప్రారంభిస్తారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట  పురస్కారాలను 28 మంది చేనేత కళాకారులకు అందజేస్తారు.


ఆచార్య జయశంకర్‌తో దిగిన ఫొటోల్లో ఇది తనకు అత్యంత  ఇష్టమైందని పేర్కొంటూ శనివారం మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో జత చేశారు. ‘‘2009 నవంబరు 29న కరీంనగర్‌లో కేసీఆర్‌ను అరెస్టు చేశారు. అనంతరం.. జయశంకర్‌, నేను హనుమకొండలోని ఆయన ఇంటికి చేరుకున్నాం. అక్కడిదే ఈ చిత్రం. ఆ తర్వాత  మా ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు’’ అని కేటీఆర్‌ వివరించారు.


 

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని