ప్రధానిని ఎదుర్కోలేకే గైర్హాజరు

‘నీతి ఆయోగ్‌ అద్భుతం అని గతంలో పొగిడింది నిజం కాదా? మీరు కోరినంత డబ్బులిస్తే మంచిది. లేకుంటే కాదా? వ్యవస్థల్ని అవమానిస్తారా? ఎనిమిదేళ్ల పాలనలో ప్రజల కోసం దిల్లీకి ఏనాడైనా వెళ్లారా? తెలంగాణ ప్రజలు

Published : 07 Aug 2022 05:13 IST

హెలికాప్టర్‌ మనీ ఇవ్వనందుకే ఆరోపణలు
కేసీఆర్‌పై బండి సంజయ్‌ ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌, దిల్లీ: ‘నీతి ఆయోగ్‌ అద్భుతం అని గతంలో పొగిడింది నిజం కాదా? మీరు కోరినంత డబ్బులిస్తే మంచిది. లేకుంటే కాదా? వ్యవస్థల్ని అవమానిస్తారా? ఎనిమిదేళ్ల పాలనలో ప్రజల కోసం దిల్లీకి ఏనాడైనా వెళ్లారా? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి’ అంటూ సీఎం కేసీఆర్‌పై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. మోదీ ప్రభుత్వంపై, నీతి ఆయోగ్‌పై సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సంజయ్‌ శనివారం ప్రకటన విడదల చేశారు. దిల్లీలో విలేకరులతోనూ మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వం లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేస్తుండటంతో.. ఈ డబ్బులపై మీ పెత్తనం పోతుందని, కమీషన్లు అందట్లేదన్న అక్కసుతోనే నీతి ఆయోగ్‌పై ఆరోపణలు చేస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే కరోనా సమయంలో హెలికాప్టర్‌ మనీ పంపాలని కోరింది నిజం కాదా’’ అని నిలదీశారు. నరేంద్రమోదీని ఎదుర్కోలేకే కేసీఆర్‌ నీతి ఆయోగ్‌ సమావేశానికి ఎగ్గొడుతున్నారని అన్నారు.  ‘గతేడాది కేంద్రం రూ.5 వేల కోట్లకు మించి రాష్ట్రానికి నిధులిచ్చినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తవా’ అని సీఎంకు సంజయ్‌ సవాలు విసిరారు.

రాజగోపాల్‌రెడ్డి ముందు నుంచే గుత్తేదారు

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై అద్దంకి దయాకర్‌ వాడిన భాషపై విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. రాజకీయాల్లో విమర్శలు హద్దుమీరితే ప్రజలు క్షమించరని... కావాలని మాట్లాడితే మాత్రం తప్పు’ అని అన్నారు. ‘‘కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజకీయాల్లోకి రాక ముందు నుంచే గుత్తేదారు. అయినా కాంట్రాక్టులు, డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకునే సంస్కృతి భాజపాలో లేదు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, కేసీఆర్‌లను తీవ్రంగా దుర్భాషలాడిన వారు తర్వాత కాలంలో కాంగ్రెస్‌, తెరాస నేతలయ్యారు. తెలంగాణ పోరాటంలో భాగస్వాములైన రాజగోపాల్‌రెడ్డి, దాసోజు శ్రవణ్‌లాంటి నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు ఇమడలేకపోతున్నారో ఆ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి’’ అని అన్నారు.  భాజపాలో చేరనున్న కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ తదితరులతో సంజయ్‌ శనివారం దిల్లీలో రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌ను ఆయన నివాసంలో కలిశారు.  దాసోజు శ్రవణ్‌తో పాటు కాంగ్రెస్‌ నేత విజయ్‌ తదితరులు ఆదివారం భాజపాలో చేరనున్నట్లు పార్టీ నేత ఒకరు చెప్పారు. తెలంగాణలో భాజపాకు అసలైన ప్రత్యామ్నాయం భాజపాయేనని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ అన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని