అకృత్యాలు చేస్తే వైకాపాలో పదోన్నతులు ఇస్తారా?

వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సింది పోయి.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూర్చొపెట్టడాన్ని చూస్తుంటే అకృత్యాలు చేసిన వారికి జగన్‌

Published : 07 Aug 2022 05:13 IST

మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాల్సింది పోయి.. పార్లమెంటరీ పార్టీ సమావేశంలో కూర్చొపెట్టడాన్ని చూస్తుంటే అకృత్యాలు చేసిన వారికి జగన్‌ పదోన్నతులు ఇస్తున్నట్లు కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తాం, ఎంపీగా రాజీనామా చేయిస్తామని సొంత పత్రికతో లీకులు ఇప్పించి, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడమేంటని ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘తనపై చర్యలు తీసుకుంటే వైకాపా నాయకుల వ్యక్తిగత విషయాలు బయటపెడతానని మాధవ్‌ బెదిరించడంతో భయపడి.. ఆ పార్టీ అధిష్ఠానం మిన్నకుంది. తన రాసలీలల వీడియో బయటపడిన తర్వాత క్షమించమని అడగాల్సిందిపోయి.. ఓ సామాజికవర్గం వారిని కించపరిచేలా ఆయన మాట్లాడారు.  వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, చివరికి సీఎం జగన్‌ కూడా సామాజికవర్గాల గురించి మాట్లాడుతున్నారు. 32 కేసులున్న విజయసాయిరెడ్డిని రెండుసార్లు రాజ్యసభకు పంపారు. గతంలో జగన్‌ను తిట్టిన ధర్మాన ప్రసాదరావు లాంటి వారు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. వైకాపా నాయకులు అవంతి శ్రీనివాస్‌, అంబటి రాంబాబు లాంటి వారు మహిళలను లైంగికంగా వేధించినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి వైకాపా వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలి...’’ అని యరపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని