KishanReddy: కేసీఆర్‌వన్నీ తొండి మాటలు..

బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం సాగిస్తున్న పాలనను రైతులు, దళితులు, గిరిజనులు, బీసీలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని.. ఆయనవి తొండి మాటలు, తొండి వ్యవహారాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి

Updated : 08 Aug 2022 06:43 IST

స్వతంత్ర సంస్థలపై బురదచల్లడం సరికాదు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం సాగిస్తున్న పాలనను రైతులు, దళితులు, గిరిజనులు, బీసీలు కథలు కథలుగా చెప్పుకుంటున్నారని.. ఆయనవి తొండి మాటలు, తొండి వ్యవహారాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. దిల్లీలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కేసీఆర్‌ కేంద్ర మంత్రిగా పని చేసిన ప్రభుత్వ హయాంలోనే పెద్ద పెద్ద వాళ్లకు రుణాలు ఇచ్చారు. ఆ ఎగవేతదారుల నుంచి రూ.8 లక్షల కోట్లు వసూలు చేసిన మొనగాడి ప్రభుత్వం మోదీది.  ‘‘మోదీని కలవడం ఇష్టంలేకపోతే ఫాంహౌస్‌లోనో, ప్రగతి భవన్‌లోనో ఉండాలి. నీతి ఆయోగ్‌ సమావేశానికి రాకపోయినా దేశ ప్రతిష్ఠను మాత్రం దిగజార్చొద్దు. రాజకీయ దురుద్దేశంతో స్వతంత్ర సంస్థలపై బురద జల్లడం సరికాదు. రాష్ట్రంలో భాజపా బలపడనంత వరకు కేంద్రం, నీతి ఆయోగ్‌ తెరాసకు మంచిగానే కనిపించాయి. కేసీఆర్‌ బాధపడినా ఆయన కుటుంబ, అవినీతి పాలనను మేము ప్రశ్నిస్తాం.. ద్వేషిస్తాం.. హామీలను గుర్తు చేస్తూనే ఉంటాం. ఆయన్ను విమర్శిస్తే తెలంగాణ ప్రజలను విమర్శించినట్లు కాదు’’ అని స్పష్టం చేశారు.

కుమారుడు సీఎం కాడనే భయంతోనే..

రాష్ట్రంలో అధికారం పోతుందని, కుమారుడు సీఎం కాడనే భయంతోనే కేసీఆర్‌ కేంద్రంపై విష ప్రచారం చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కేంద్రానికి కేసీఆర్‌ కుటుంబ సభ్యులు రాసే ప్రతి ఉత్తరంలో అన్‌ పార్లమెంటరీ భాష, అబద్ధాలు ఉంటాయని అన్నారు. ఈ ఏడాది విమోచన దినోత్సవం నిర్వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మిషన్‌ భగీరథలో కలుషిత నీరు వస్తోందని ఆరోపించారు.

దేశంలో జెండాల కొరత  

దేశంలో ప్రస్తుతం జెండాల కొరత ఉన్నందున ప్రతి భారతీయుడు జెండాను ప్రింట్‌ తీసి ఆగస్టు 15న తమ ఇంటి గోడలపై అతికించాలని కిషన్‌రెడ్డి సూచించారు. ఆగస్టు 11న దేశ విభజన దినం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నాటి ఘటనలపై పార్లమెంట్‌లో సోమవారం ఫొటో ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ ఆదివారం మధ్యాహ్నం కిషన్‌రెడ్డి అధికారిక నివాసానికి వచ్చారు. నేతలిద్దరూ కలిసి భోజనం చేశారు.


అవినీతి, అక్రమం, అరాచకం, ఆర్భాటం, అధర్మం, అహంకారం, అధికార దుర్వినియోగం, అసహనం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయనకు ఆయనే సాటి.

సమాఖ్య స్ఫూర్తి అంటే కుటుంబ పాలన కాదు. ప్రజలకు నేరుగా ఏం చేసినా కేసీఆర్‌ ప్రశ్నిస్తున్నారు. నేరుగా ఆయన కుటుంబానికి ఇవ్వాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

- కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి


భాజపాలో చేరిన దాసోజు శ్రవణ్‌

ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా నేతృత్వంలో తెలంగాణలో అత్యంత ప్రజాదరణ పొందిన పార్టీగా భాజపా అవతరించిందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు తరుణ్‌ఛుగ్‌ అన్నారు. కాంగ్రెస్‌ జాతీయ మాజీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆదివారం భాజపాలో చేరారు. ఛుగ్‌ ఆయనకు పార్టీ సభ్యత్వాన్ని అందజేశారు. శ్రవణ్‌తో పాటు కాంగ్రెస్‌కు చెందిన పలువురు కార్యకర్తలు భాజపాలో చేరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని