Bandi Sanjay: అధికారంలోకి వస్తే చేనేత ఉత్పత్తులను మేమే కొంటాం

భాజపా అధికారంలోకి వస్తే చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ కల్పించి, ఇళ్లు లేని చేనేత కార్మికులందరికీ గూడు

Updated : 08 Aug 2022 05:04 IST

నేత కార్మికుల అవస్థలకు కారణం కేసీఆరే
ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్‌ విమర్శలు

ఈనాడు, నల్గొండ: భాజపా అధికారంలోకి వస్తే చేనేత ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్‌ కల్పించి, ఇళ్లు లేని చేనేత కార్మికులందరికీ గూడు చూపిస్తామన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలకు, వారి దుర్భర జీవితాలకు ముమ్మాటికీ సీఎం కేసీఆరే కారణమని విమర్శించారు. మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా అయిదో రోజైన ఆదివారం ‘జాతీయ చేనేత దినోత్సవం’ సందర్భంగా యాదాద్రి జిల్లా పోచంపల్లిలో నిర్వహించిన చేనేత కార్మికుల సమ్మేళనం సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం నేత కార్మికులకు నూలు రాయితీనిచ్చే మిత్ర పథకాన్ని ఇక్కడ సీఎం పట్టించుకోలేదు. చేనేత బీమానూ మరచిపోయారు. మేం ఆందోళన చేస్తామనగానే ఆయన బీమా ప్రకటించారు. 360 మంది ఆర్థిక కష్టాలతో మగ్గాలపై చనిపోతే ఆదుకోలేదు కానీ.. రాష్ట్ర ప్రజల డబ్బును పంజాబ్‌ రైతులకు అందించారు. తక్షణం చేనేత సహకార సంఘాల ఎన్నికలను నిర్వహించాలి.మాజీ ప్రధాని వాజపేయీ హయాంలోనే పోచంపల్లికి టై అండ్‌ డైను అందించారు. సిల్క్‌ సమగ్ర స్కీం కింద రాష్ట్రానికి రూ.700 కోట్లు మంజూరయ్యాయి. నేషనల్‌ హ్యాండ్లూం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌డీసీ) కింద కార్డున్న ప్రతి కుటుంబానికి నెలకు 15-20 రోజుల ఉపాధి కల్పిస్తున్నాం. ఇచ్చిన హామీలను అమలుచేయని కేసీఆర్‌ను తరిమికొట్టాలి’’ అన్నారు. అయిదో రోజు పోచంపల్లి మండలం ముక్తాపూర్‌ వద్ద ప్రారంభమైన పాదయాత్ర చౌటుప్పల్‌ మండలం మసీదుగూడెం వద్ద రాత్రి ముగిసింది. పోచంపల్లిలో ఆర్థిక కష్టాలతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నేత కార్మికుడు దోర్నాల కృష్ణ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దివ్యాంగ చేనేత కార్మికుడు గొట్టిముక్కుల రమేశ్‌ కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వటంతో పాటు వారి పిల్లల బాధ్యతలు తానే తీసుకుంటానని సంజయ్‌ హామీ ఇచ్చారు.

సీసా కలకలం!

చేనేత కార్మికుల సమ్మేళనం సభ వెనకాల ఓ వ్యక్తి  సీసాతో హల్‌చల్‌ చేయడం కలకలం రేపింది. వేదికపైకి ఎక్కడానికి ప్రయత్నించిన సదరు వ్యక్తిని భాజపా కార్యకర్తలు నిలవరించి పోలీసులకు అప్పగించారు. అతని సీసాలో మద్యం ఉన్నట్లు తేలిందని స్థానిక ఎస్సై సైదిరెడ్డి ‘ఈనాడు’కు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని