Updated : 08 Aug 2022 05:06 IST

Bhatti Vikramarka: స్వాతంత్య్ర సంగ్రామంలో భాజపా ఎక్కడ?

నాటి చరిత్రలో దానికి ఒక్క పేజీ కూడా లేదు
9 నుంచి 15 వరకు ఆజాదీ గౌరవ్‌ పాదయాత్రలు: భట్టి విక్రమార్క

గాంధీభవన్‌, ఖమ్మం కమాన్‌బజార్‌, న్యూస్‌టుడే: స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఒక్క పేజీ కూడా లేని భాజపా అదే స్వాతంత్య్రం తీసుకొచ్చినట్లు ప్రచార ఆర్భాటం చేయడం విడ్డూరం. మహాత్మాగాంధీ నేతృత్వంలో జరిగిన పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌పటేల్‌ పేరును భాజపా వాడుకుంటూ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోంది. ఈ ఉద్యమంలో భాజపా ఎక్కడ ఉంది’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ అధ్యక్షతన ఆదివారం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులతో జరిగిన జూమ్‌ సమావేశంలో, ఖమ్మంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఏఐసీసీ పిలుపు మేరకు ఈనెల 9 నుంచి 15 వరకు నిర్వహించ తలపెట్టిన ఆజాదీ గౌరవ్‌ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో 75 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. ‘‘దేశానికి కాంగ్రెస్‌ పార్టీ, మన నేతలు చేసిన పోరాటాలు, త్యాగాలు నేటి తరానికి వివరించండి. స్వతంత్య్ర ఫలాలు ఈ దేశ ప్రజలకు అందించడంలో కాంగ్రెస్‌ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది. స్వాతంత్య్రానికి ముందు, తర్వాత కాంగ్రెస్‌ పార్టీ, ప్రభుత్వాలు చేసిన కృషి ఫలితంగా నేడు భారత్‌ ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా నిలిచింది’’ అని అన్నారు. మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోట అని, ఉప ఎన్నిక జరిగితే గతం కంటే మెజారిటీ పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్‌కు వామపక్షాల మద్దతు కోరతామన్నారు. ఇప్పటికే మునుగోడులో రాజగోపాల్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని, మీరు కూడా వీడతారనే ప్రచారం సాగుతోందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు భట్టి ఒకింత అసహనం వ్యక్తం చేస్తూ ‘నేనే కాంగ్రెస్‌, కాంగ్రెస్సే నేను. మీ ప్రశ్నకు ఇదే సమాధానమ’న్నారు.  


చేనేత కళను చంపేందుకు ప్రయత్నిస్తున్న భాజపా: రేవంత్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేత కార్మికులకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేనేత మీద 12 శాతం జీఎస్టీ వేయడం పట్ల ట్విటర్‌ వేదికగా స్పందించారు. చేనేత కళను చంపేందుకు భాజపా ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పీసీసీ చేనేత విభాగం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీభవన్‌లో సమావేశం జరిగింది. చేనేత మీద 12 శాతం జీఎస్టీని ఉపసంహరించుకోవాలని ఆ విభాగం వర్కింగ్‌ ఛైర్మన్‌ రమేష్‌, రంగారెడ్డి తదితరులు డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని