Updated : 08 Aug 2022 05:07 IST

Politics news: ఐక్యత లేక.. సఖ్యత కానరాక!

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలతో విపక్షాల మధ్య బయటపడ్డ అభిప్రాయ భేదాలు
పైచేయి కోసమే కాంగ్రెస్‌, తృణమూల్‌ ఆరాటం

దిల్లీ: రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యతకు బదులు.. వాటి మధ్య చీలికలు బయటపడ్డాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ల మధ్య! ఈ రెండు పార్టీల నేతలు బహిరంగంగా విమర్శలు గుప్పించుకోవడం, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోలింగ్‌కు తృణమూల్‌ దూరంగా ఉండటం.. వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్షాలకు ఎంతమాత్రమూ శుభసూచకం కాదు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలు ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడం వెనక ఘనత తమదేనని చాటుకునేందుకు అటు కాంగ్రెస్‌, ఇటు తృణమూల్‌ గట్టిగానే ప్రయత్నించాయి. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక వ్యవహారం వాటి మధ్య అభిప్రాయ భేదాలను స్పష్టంగా బయటపెట్టింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మార్గరెట్‌ ఆళ్వా ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలవగా.. ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తృణమూల్‌ ప్రకటించింది. ఇద్దరు తిరుగుబాటు నేతలు మినహా ఆ పార్టీకి చెందిన ఎంపీలెవరూ ఓటు వేయలేదు కూడా. ఈ వ్యవహారంలో తృణమూల్‌ తీరుపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ బాహాటంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆళ్వా కూడా ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ విమర్శలకు తృణమూల్‌ నేతలు పలుమార్లు దీటుగా స్పందించారు. ‘‘కాంగ్రెస్‌ మాకు మిత్రపక్షమేమీ కాదు. భావసారూప్యమున్న పార్టీ మాత్రమే’’ అని ఆ పార్టీ నేత సాకేత్‌ గోఖలే ఓ దశలో వ్యాఖ్యానించారు.

రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ కూడా విపక్షాలకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధానంగా అస్సాం, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీల్లో గణనీయ సంఖ్యలో ఎన్డీయే అభ్యర్థి వైపు మొగ్గారు. ఫలితంగా విపక్షాల అభ్యర్థికి ముందుగా ఊహించినన్ని ఓట్లు కూడా రాలేదు. ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా వంటి కొన్ని విపక్ష పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించడమూ వాటి మధ్య ఐకమత్య లోపాన్ని బయటపెట్టినట్లయింది.  రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేను గద్దె దించాలన్న ప్రతిపక్షాల లక్ష్యాన్ని తాజా పరిణామాలు మరింత క్లిష్టతరంగా మార్చేశాయన్నది రాజకీయ పరిశీలకుడు రషీద్‌ కిద్వాయ్‌ అభిప్రాయం. కాంగ్రెస్‌, తృణమూల్‌ మధ్య దూరం పెరుగుతుండటానికి ఇరు పార్టీలూ సమానంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘‘మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ విపక్ష కూటమిలో తమకు అతిపెద్ద భాగస్వామ్య పక్షమన్న సంగతిని కాంగ్రెస్‌ గుర్తించాలి. అలాగే దేశంలో కాంగ్రెస్సే ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనే విషయాన్ని దీదీ పార్టీ గుర్తుపెట్టుకోవాలి’’ అని సూచించారు. కాంగ్రెస్‌, తృణమూల్‌ పరస్పరం విమర్శలు గుప్పించుకోవడం చూస్తే.. విపక్షాల ఐక్యతపై వాటికి పట్టింపు లేనట్లుందని, కేవలం పైచేయి కోసమే ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందని జేఎన్‌యూ ప్రొఫెసర్‌ సంజయ్‌ కె. పాండే వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని