TRS: తెరాసకు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు రాజీనామా

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) పార్టీకి ఆదివారం

Updated : 08 Aug 2022 05:09 IST

కాశీబుగ్గ(వరంగల్‌), న్యూస్‌టుడే: రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ బ్యాంకు ఛైర్మన్‌ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు తెలంగాణ రాష్ట్ర సమితి(తెరాస) పార్టీకి ఆదివారం రాజీనామా చేశారు. వరంగల్‌ కాశీబుగ్గ ఓసిటీలోని తన స్వగృహంలో అనుచరవర్గంతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. ‘తెరాసతో ఉన్న ఎనిమిదేళ్ల బంధం ఈ రోజుతో తెగిపోయింది. 2014లో తెరాసలో చేరినప్పుడు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అదిష్ఠానం హామీ ఇచ్చింది. పార్టీ ఆదేశానుసారం వరంగల్‌ తూర్పులో తెరాస అభ్యర్థి విజయం కోసం పనిచేశా. 2016లో మేయర్‌గా అవకాశం ఇస్తామన్నారు. 2018 ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు ప్రయత్నించినప్పుడు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు. అయినా పార్టీ అభ్యర్థి నరేందర్‌ విజయం కోసం పనిచేశా. గత ఏడాది జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో నా అనుచర వర్గంలో ఒక్కరికీ కార్పొరేటర్‌ టికెట్‌ ఇవ్వలేదు. తెరాసలో ఎన్నేళ్లు ఉన్నా ఫలితం లేదని కార్యకర్తలంతా చెప్పడంతో రాజీనామా నిర్ణయం తీసుకోక తప్పలేదు’ అని ప్రదీప్‌రావు తెలిపారు. కార్యకర్తలతో మరోమారు చర్చించాక వేరే పార్టీలో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని