తెదేపా నాయకుడిపై వైకాపా వర్గీయుల దాడి

కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్‌ క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పర్వతనేని జగన్మోహనరావు శతజయంతి వేడుకలకు హాజరైన తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ

Published : 08 Aug 2022 05:17 IST

కొడాలి నాని అనుచరుల నుంచి ప్రాణహాని ఉందన్న బాధితుడు

గుడివాడ గ్రామీణం, న్యూస్‌టుడే: కృష్ణా జిల్లా గుడివాడలోని ఎన్టీఆర్‌ క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన పర్వతనేని జగన్మోహనరావు శతజయంతి వేడుకలకు హాజరైన తూర్పు కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ మాజీ ఛైర్మన్‌ గుత్తా శివరామకృష్ణ (చంటి)పై ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు దాడికి పాల్పడ్డారు. స్టేడియం కమిటీ ప్రతినిధులు వారిని వారించి, చంటిని ఓ గదిలో ఉంచారు. దాడికి పాల్పడిన ఇద్దర్నీ వైకాపా నాయకులు కార్లలో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోవడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం శివరామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ..  స్టేడియం నిర్మించిన వారిలో ప్రముఖుడైన పర్వతనేని జగన్మోహనరావు శతజయంతి ఉత్సవాలకు ఆయన కుమారుడు పర్వతనేని ఆనంద్‌ పిలవడంతో వెళ్లానన్నారు. వైకాపా వారి సమావేశానికి ఎందుకొచ్చావంటూ కొడాలి నాని అనుచరులు, వైకాపా నాయకులు తనతో గొడవ పడ్డారన్నారు. గుడ్లవల్లేరు బాబ్జి, వల్లూరుపల్లి సుధాకర్‌ పథకం ప్రకారం కర్రలతో దాడి చేసి గాయపర్చారని చెప్పారు. స్టేడియం కమిటీ పెద్దలు అడ్డులేకుంటే తనను చంపేసేవారన్నారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందన్నారు. పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లి తనపై దాడికి పాల్పడిన వైకాపా నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద కొంతసేపు నిరసన ప్రదర్శన చేశారు. సీహెచ్‌.రాజశేఖర్‌, గడ్డం ప్రకాష్‌దాస్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని