గడప గడపకూ ఛీత్కారాలు.. నిలదీతలే

సీఎం జగన్‌ ఉత్తుత్తి పథకాలతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులకు ఛీత్కారాలు, నిలదీతలే ఎదురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో

Published : 08 Aug 2022 05:17 IST

తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ ఉత్తుత్తి పథకాలతో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వైకాపా ప్రజాప్రతినిధులకు ఛీత్కారాలు, నిలదీతలే ఎదురవుతున్నాయని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. వైకాపా వాళ్లు తమ ఇంటికి రావద్దంటూ ప్రజలు బోర్డులు పెట్టుకుంటున్నారని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ‘నేను ఉన్నాను.. నేను విన్నాను అని చెప్పినందుకు నమ్మి ఓట్లేసిన ప్రజలను నిట్టనిలువునా మోసగించారు. ఇళ్లకు వస్తున్న వైకాపా నాయకులపై తిట్ల దండకంతో ప్రజలు చెలరేగిపోతున్నారు. మూడేళ్లుగా ఎమ్మెల్యేలను పట్టించుకోని జగన్‌రెడ్డి ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి నియోజకవర్గానికి రూ.2కోట్లు కేటాయించి ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రజాశ్రేయస్సును గాలికొదిలి అన్ని వర్గాల ఆగ్రహానికి గురయ్యారు’ అని యనమల ధ్వజమెత్తారు. పాడైన రహదారులు, తాగునీటి సమస్య, ఊసెత్తని ఉద్యోగాలు, అటకెక్కిన సీపీఎస్‌ రద్దు, ప్రాణాలు తీస్తున్న సర్కారు కల్తీ మద్యం.. ఇలా అనేక సమస్యలపై ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక వైకాపా ఎమ్మెల్యేలు ముఖం చాటేస్తున్నారని యనమల మండిపడ్డారు. ‘ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం ఎలా బయటపడుతుందో ఆర్థిక నిపుణులకూ అంతుచిక్కట్లేదు. జగన్‌ పథకాల పేరుతో అప్పులు చేసి, రాష్ట్రాన్ని దివాలా తీయించే పనులు చేస్తున్నారు. ప్రజలు మిమ్మల్ని మరింతకాలం భరించే పరిస్థితి లేదు’ అని రామకృష్ణుడు విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని