Chandrababu: పద్మ.. ‘నెల్లూరు సినతల్లి’: చంద్రబాబు

తన భర్త మరణంపై ‘జై భీమ్‌’ సినిమా తరహాలో న్యాయ పోరాటం చేస్తున్న పద్మ ‘నెల్లూరు సినతల్లి’ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వానికి, వ్యవస్థలకు

Updated : 08 Aug 2022 09:56 IST

భర్త మరణంపై ఆమె చేస్తున్న న్యాయపోరాటం స్ఫూర్తిదాయకం: చంద్రబాబు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తన భర్త మరణంపై ‘జై భీమ్‌’ సినిమా తరహాలో న్యాయ పోరాటం చేస్తున్న పద్మ ‘నెల్లూరు సినతల్లి’ అని తెదేపా అధినేత చంద్రబాబు కొనియాడారు. ప్రభుత్వానికి, వ్యవస్థలకు ఎదురు నిలబడి ఎస్సీ మహిళ పద్మ చేస్తున్న పోరాటం అసామాన్యమని అభినందించారు. ఎస్సీ వర్గాల పోరాటం, జాతీయ ఎస్సీ కమిషన్‌ విచారణలతో రాష్ట్ర ప్రభుత్వం కదలక తప్పదని ఆదివారం ట్విటర్లో ఆయన హెచ్చరించారు.‘‘నెల్లూరు జిల్లా పొదలకూరు ఎస్సై కరీముల్లా కొట్టడం వల్లే తన భర్త ఉదయగిరి నారాయణ చనిపోయాడని, నిందితులకు శిక్ష పడాలని పద్మ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకం. పరిహారంతో సరిపెట్టకుండా నారాయణ మృతికి కారణమైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలి. తండ్రి మరణంతో ముగ్గురు బిడ్డలు రోడ్డునపడ్డ ఈ ఘటనలో బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలి’’ అని ట్వీట్‌ చేశారు.

ఎంపీని కొందరు పోలీసులు సమర్థించడం దారుణం
తప్పు చేసిన పార్లమెంట్‌ సభ్యులను సమర్థించే నీచ స్థాయికి రాష్ట్రంలో కొందరు పోలీసులు వెళ్లడం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు ఆదివారం ట్విటర్లో మండిపడ్డారు. ‘‘వైకాపా ఎంపీ మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కుప్పంలో తెదేపా చేపట్టిన నిరసనల సందర్భంగా.. ‘దేశాన్ని కాల్చండి’ అంటూ స్వయంగా ఓ సీఐ వ్యాఖ్యలు చేయడం సబబు  కాదు. నిందితులకు బహిరంగంగా పోలీసులు మద్దతు పలకడమే కాకుండా.. నిరసనలు చేపట్టిన తెదేపా కుప్పం నేతలపై అక్రమ కేసులు పెట్టడాన్నిఖండిస్తున్నాను. మాపై తప్పుడు కేసులు పెట్టడం మాని.. బరి తెగించిన అధికారులను డీజీపీ అదుపులో పెట్టాలి’’ అని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని