కేంద్ర ప్రభుత్వంలో చేరబోం!

కేంద్ర మంత్రిమండలిలో చేరేది లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ ఆదివారం తేల్చిచెప్పింది. అయితే భాజపాతో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాలను తోసిపుచ్చింది. ‘అంతా బాగానే ఉంది’ అని పేర్కొంది. ఈమేరకు

Published : 08 Aug 2022 06:22 IST

భాజపాతో అంతా బాగుంది : జేడీయూ

పట్నా: కేంద్ర మంత్రిమండలిలో చేరేది లేదని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌కు చెందిన జేడీయూ ఆదివారం తేల్చిచెప్పింది. అయితే భాజపాతో విభేదాలు నెలకొన్నాయన్న ఊహాగానాలను తోసిపుచ్చింది. ‘అంతా బాగానే ఉంది’ అని పేర్కొంది. ఈమేరకు పట్నాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన జేడీయూ జాతీయ అధ్యక్షుడు రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ అలియాస్‌ లాలన్‌ పలు అంశాలపై స్పష్టతనిచ్చారు. కేంద్ర మంత్రిమండలిలో ప్రాతినిధ్యం వహించేందుకు తమ పార్టీకి ఎలాంటి ఆసక్తి లేదని చెప్పారు. ఈమేరకు 2019లోనే తమ నేత నీతీశ్‌ కుమార్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కేంద్ర మాజీమంత్రి ఆర్‌సీపీ సింగ్‌ శనివారం జేడీయూ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో లాలన్‌ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకుంటూ మాట్లాడారు. ‘‘ఆయన నిన్ననే పార్టీని వీడి ఉండొచ్చు. కానీ చాలాకాలంగా ఆయన మనసు ఎక్కడో ఉంది’’ అని ఆర్‌సీపీ సింగ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘కేంద్ర ప్రభుత్వంలో చేరకూడదని 2019లోనే నిర్ణయం తీసుకుంటే.. 2021లో ఆర్‌సీపీ సింగ్‌ మంత్రి అయ్యారు కదా!’’ అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘అప్పటికి పార్టీ జాతీయ అధ్యక్షుడుగా ఉన్న ఆయన్నే (ఆర్‌సీపీ సింగ్‌) అడగండి’’ అని లాలన్‌ జవాబిచ్చారు. నీతీశ్‌ కుమార్‌ ఆశీర్వాదంతోనే తాను లేదా ఆర్‌సీపీ జాతీయ అధ్యక్షులం అయ్యామని అన్నారు. కాగా ప్రధాని మోదీ నేతృత్వంలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశానికి నీతీశ్‌ గైర్హాజరుపై అడిగిన ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా స్పందిస్తూ ‘‘ముఖ్యమంత్రినే అడగండి’’ అని అన్నారు. ఇటీవల కొవిడ్‌ బారిన పడిన నీతీశ్‌ నీరసంగా ఉండటం వల్లే నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆయన అదే రోజు పట్నాలో నిర్వహించిన కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని