మునుగోడు ఖాళీ

మునుగోడు శాసనసభ స్థానం (నెం.93) ఖాళీ అయింది.అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

Published : 09 Aug 2022 06:50 IST

 ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా

వెంటనే ఆమోదం

21న భాజపాలోకి

నవంబరు లేదా డిసెంబరులో ఉపఎన్నిక జరిగే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: మునుగోడు శాసనసభ స్థానం (నెం.93) ఖాళీ అయింది.అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. సోమవారం ఉదయం శాసనసభలో ఆయన స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కలిసి రాజీనామా పత్రాన్ని అందజేశారు. పరిశీలించిన వెంటనే సభాపతి దానిని ఆమోదించారు. అనంతరం శాసనసభ సచివాలయం దీనిపై నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామాను సభాపతి ఆమోదించారని, ఆయన రాజీనామా సోమవారం నుంచి అమల్లోకి వచ్చిందని, మునుగోడు స్థానం ఖాళీ అయిందని అందులో పేర్కొంది.  ఈ సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి పంపింది. ఆయన వెంటనే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. 2018లో శాసనసభ ఎన్నికల తర్వాత ఇది రెండో రాజీనామా. గత ఏడాది ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాష్ట్ర శాసనసభలో 119 శాసనసభ స్థానాలుండగా ఒకటి ఖాళీ కావడంతో ఎమ్మెల్యేల సంఖ్య 118కి తగ్గింది. కాంగ్రెస్‌ సభ్యుల సంఖ్య ఒకటి తగ్గి అయిదుకు చేరింది. 103 స్థానాల్లో తెరాస, 7 స్థానాల్లో మజ్లిస్‌, మూడుచోట్ల భాజపా సభ్యులున్నారు. వీరు గాక ఒక నామినేటెడ్‌ సభ్యుడు ఉన్నారు.

మునుగోడు ప్రజల కోసమే త్యాగం

సభాపతికి కలవడానికి ముందు రాజగోపాల్‌రెడ్డి గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. తన రాజీనామా లేఖను మీడియా సమక్షంలో అందరికీ చూపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మునుగోడు ప్రజలు, తెలంగాణ సమాజం కోసం తన పదవిని త్యాగం చేస్తున్నట్లు, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ‘‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. తెలంగాణ సమాజం ఆకలినైనా సహిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని వదిలిపెట్టదు.  కేసీఆర్‌ చేతిలో ఆత్మగౌరవం బందీ అయింది. రాజీనామా అనగానే కొత్తగా గట్టుప్పల్‌ మండలం వచ్చింది. సోషల్‌ మీడియాలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.ఈ యుద్దం నా కోసం కాదు. మునుగోడు ప్రజల కోసం.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. కేసీఆర్‌కు సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్‌ తప్ప వేరేవి కనిపించడం లేదు.నా రాజీనామాతోనైనా సీఎం కేసీఆర్‌ కళ్లు తెరవాలి.  మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చి.. కేసీఆర్‌ చేతిలో చిక్కిన తెలంగాణ తల్లికి విముక్తి కలిగించాలి’’ అని రాజగోపాల్‌ కోరారు.


ఉప ఎన్నిక ఎప్పుడో...

రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖాయమైంది. ఏదైనా శాసనసభ, లోక్‌సభ స్థానం ఖాళీ అయితే నిబంధనల మేరకు ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగి భర్తీ కావాలి. గత ఏడాది జూన్‌ 12న ఈటల రాజేందర్‌ రాజీనామా చేయగా... నాలుగున్నర నెలల తర్వాత ..అక్టోబరు 30న ఉపఎన్నికలు జరిగాయి. రాజగోపాల్‌రెడ్డి శాసనసభ సాధారణ ఎన్నికలకు 18 నెలల ముందు రాజీనామా చేశారు. దీంతో ఎన్నికలు ఎప్పుడుంటాయనే ఉత్కంఠ ఏర్పడింది. రాజగోపాల్‌రెడ్డి ఈ నెల 21న భాజపాలో చేరుతున్నారు. ఆ తర్వాతే  ఉప ఎన్నిక తేదీపై స్పష్టత వచ్చే వీలుంది. వాస్తవంగా హిమాచల్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు నవంబరులో, గుజరాత్‌ ఎన్నికలు డిసెంబరులో జరగనున్నాయి. ప్రత్యేకంగా వద్దనుకుంటే భాజపా వీటితో కలిపి మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని