వైకాపా వారిలా కేసుల మాఫీకి చంద్రబాబు దిల్లీ వెళ్లలేదు

వైకాపా వారిలా కేసుల మాఫీ కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు దిల్లీ వెళ్తే వైకాపా వారు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని

Updated : 09 Aug 2022 06:31 IST

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైకాపా వారిలా కేసుల మాఫీ కోసం తమ పార్టీ అధినేత చంద్రబాబు దిల్లీ వెళ్లలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. చంద్రబాబు దిల్లీ వెళ్తే వైకాపా వారు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. తప్పు చేసిన వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోకుండా తెదేపా వారిపై విమర్శలు చేయడం అధికార పార్టీ నాయకులకు అలవాటుగా మారిందని సోమవారం ప్రకటనలో మండిపడ్డారు. ‘దేశభక్తికి సంబంధించిన అంశాలను కూడా వైకాపావారు రాజకీయానికి వాడుకుంటున్నారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని.. నేడు సీబీఐ, ఈడీ కేసులనుంచి బయటపడటానికి, అప్పుల కోసం వారి ముందు సాగిలపడుతున్నారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన సలహాలేంటి? రాజ్యాంగేతర శక్తిగా మారిన సజ్జల మంత్రులను డమ్మీలను చేశారు. ఆయన చంద్రబాబును విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది. సజ్జల, విజయసాయిలాంటి వాళ్లు ఎన్ని కుయుక్తులు పన్నినా రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయం. తాడేపల్లి ప్యాలెస్‌కు టులెట్‌ బోర్డు పెట్టడం ఖాయం’ అని పేర్కొన్నారు.    

గోరంట్ల మాధవ్‌పై చర్యలేవి?: ఆలపాటి

రాష్ట్రానికి ఓ మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఎంపీ గోరంట్ల మాధవ్‌లాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మండిపడ్డారు. మహిళలను అవమానించడం, కించపరచడం వైకాపా ఎమ్మెల్యేలు, ఎంపీలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘గతంలో తెదేపా నాయకులపై తొడగొట్టారని గోరంట్ల మాధవ్‌లాంటి వారిపై కేసులున్నా జగన్‌ ఎంపీ టికెట్టు ఇచ్చారు. ఇప్పుడాయన తెలుగుజాతి గౌరవాన్ని మంటగలిపారు. పైగా ఓ సామాజికవర్గంవారే ఇదంతా చేయించారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఎంపీ రఘురామకృష్ణరాజును మాధవ్‌తో కొట్టించడానికి జగన్‌ ప్రయత్నించిన రోజే ఈ ఘటనకు నాంది పడింది. వైకాపాలో సుమారు 87మంది నేర చరితులు ఉన్నారని నేషనల్‌ క్రైంబ్యూరో నివేదిక వెల్లడించింది. దేశంలో మహిళల గౌరవానికి భంగం కలిగించే సంఘటనలు ఏపీలోనే ఎక్కువ జరుగుతున్నాయని పేర్కొంది. రాష్ట్రంలో మహిళా కమిషన్‌, డీజీపీ ఏమయ్యారు? రాష్ట్ర ప్రభుత్వం మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఆలపాటి డిమాండ్‌ చేశారు.

మహిళల మీద దాడులపై నేడు తెదేపా సమావేశం  

రాష్ట్రంలో మహిళలపై దాడులపై చర్చించేందుకు విజయవాడలోని హోటల్‌ స్వర్ణాప్యాలెస్‌లో మంగళవారం ఉదయం పది నుంచి రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెదేపా సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్నవీడియో, వికృత చేష్టలతోపాటు పోలీసుల అక్రమ కేసులు, రాజకీయ నిర్బంధాలపై సమావేశంలో చర్చిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని